Bandi Sanjay: బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయి: బండి సంజయ్
- కాంగ్రెస్‌కు ఇమేజ్ లేదు... బీఆర్ఎస్‌ను ఓడగొట్టేది బీజేపీయేనని వ్యాఖ్య
- కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని విమర్శలు
- రెండు పార్టీలనూ ఓడించాలని పిలుపు
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అవుతారని... కానీ తాను ముఖ్యమంత్రి అవుతానని చెప్పడం లేదని... పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీసీ ముఖ్యమంత్రి కావడం మాత్రం తథ్యమన్నారు. చొప్పదండిలో బొడిగె శోభ తరఫున ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఇమేజ్ లేదని, బీఆర్ఎస్‌ను ఓడగొట్టేది బీజేపీయే అన్నారు. ఇందుకు గత ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌కు డబ్బులు పంచుతున్న కేసీఆర్‌ను, కాసులకు అమ్ముడుపోయే కాంగ్రెస్‌ను... ఇద్దరినీ ఓడించాలన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయని సంజయ్ హెచ్చరించారు. బీఆర్ఎస్‌లో కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ కుమార్... వీళ్లంతా ముఖ్యమంత్రి కావాలని పోటీ పడుతున్నారన్నారు. కాంగ్రెస్‌లోను అదే పరిస్థితి ఉందన్నారు. అందరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడతారని ఎద్దేవా చేశారు. చొప్పదండిలో బొడిగె శోభను గెలిపించకుంటే మీరంతా ఓవైసీ తమ్ముళ్లు అవుతారని అన్నారు. ధరణి తప్పుల తడక అని కేసీఆరే చెప్పారని, కేసీఆర్ అఫిడవిట్ ప్రకారం ఆయన భూరికార్డుల్లో ఓ గుంట భూమి ఎక్కువగా ఉందన్నారు.