TDP: ఏపీ సర్కారు లెక్కలన్నీ ఫేక్: దేవినేని ఉమ

TDP Senior Leader Devineni Uma Tweet

  • అప్పుల కోసమే తప్పుడు లెక్కలంటూ విమర్శ
  • జీఎస్టీ, తలసరి ఆదాయం.. అన్నీ తప్పులేనని ఆరోపణ
  • అప్పులలో రాష్ట్రాన్ని అగ్రగామి చేశారన్న దేవినేని

తెలుగుదేశం అధినేత చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోగా.. వైఎస్ జగన్ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ విమర్శించారు. అప్పుల కోసం జగన్ సర్కారు తప్పుడు లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పే లెక్కలన్నీ ఫేక్ అంటూ ఆరోపించారు. జీఎస్టీపీ ఫేక్.. తలసరి ఆదాయం ఫేక్.. ఇలా అన్నీ తప్పుడు లెక్కలతో ప్రజలను, కేంద్రాన్ని మోసం చేస్తున్నారని విమర్శించారు.

ఏపీలో ప్రస్తుతం అభివృద్ధి లేదు.. పాలకులు బిల్లులు చెల్లించరని దేవినేని ఉమ ఆరోపించారు. చెల్లించాల్సిన బిల్లులన్నీ పెండింగ్ లోనే ఉంటే ప్రభుత్వం చేసిన అప్పులు దేనికోసమని ప్రశ్నించారు. ఈ నాలుగేళ్ల పాలనలో జగన్ సర్కారు అప్పు చేసి తీసుకొచ్చిన పది లక్షల కోట్లు ఎక్కడికి వెళ్లాయని ప్రభుత్వాన్ని ట్విట్టర్ వేదికగా దేవినేని ఉమ నిలదీశారు.

శుక్రవారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో జరిగిన ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ’ కార్యక్రమంలో దేవినేని ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయ సాయిరెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పేటీఎం బ్యాచ్‌ కు మాత్రమే జగన్ అవసరమని, ఏపీకి ఆయన అవసరంలేదని అన్నారు. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, అభివృద్ది కావాలంటే బాబు రావాలని చెప్పారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

TDP
Andhra Pradesh
Devineni Uma
Tweet
AP Govt
Jagan
per capita income
GST
Vote for CBN

More Telugu News