Hyderabad: దీపావళి వేడుకలు.. జంట నగరాల ప్రజలకు హైదరాబాద్ సీపీ కీలక సూచనలు

Hyderabad CP urges people to follow guideline related to diwali celebrations

  • రహదారులు, బహిరంగప్రదేశాల్లో బాణసంచా కాల్చేందుకు అనుమతి లేదన్న సీపీ శాండిల్య
  • పండుగ నాడు రాత్రి 8 నుంచి 10 వరకే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉందని వెల్లడి
  • వాయుకాలుష్యానికి సంబంధించిన మార్గదర్శకాలు పాటించాలని స్పష్టీకరణ
  • నిబంధనలు అతిక్రమించేవారిపై చర్యలు తప్పవని హెచ్చరిక

దీపావళి వేడుకలకు సంబంధించి జంట నగరాల ప్రజలకు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య పలు సూచనలు చేశారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడంపై నిషేధం ఉందని స్పష్టం చేసిన ఆయన, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సుప్రీంకోర్టు ఈ అంశంపై గతంలో ఇచ్చిన తీర్పును కూడా సీపీ ప్రస్తావించారు. 

పండుగ వేళ రాత్రి 8 నుంచి 10 వరకూ మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతి ఉందన్నారు. క్రాకర్స్, డ్రమ్స్ నుంచి వెలువడే శబ్దానికి సంబంధించి పరిమితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ విషయంలో కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాలను పాటించాలని స్పష్టంచేశారు. ఈ ఉత్తర్వులు 12వ తేదీ ఉదయం 6 నుంచి 15వ తేదీ ఉదయం ఆరు వరకూ అమల్లో ఉంటాయని తెలిపారు.

రాజస్థాన్‌లో వాయు, శబ్ద కాలుష్యానికి సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌పై ఇటీవల జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్‌ల ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బాణసంచా తయారీలో బేరియం సహా ఇతర నిషేధిత పదార్థాలేవీ వాడకూడదని గతంలోనే తీర్పు వెలువరించిన విషయాన్ని ధర్మాసనం పేర్కొంది.  గ్రీన్ క్రాకర్స్‌కు అనుమతి ఉందని, వాటిని దీపావళి వంటి పండుగ వేళల్లో రాత్రి 8 నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే కాల్చుకోవాలని చెప్పింది. ఈ నిబంధనలు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తాయని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News