Catch: క్రికెట్ లో ఇలా కూడా క్యాచ్ పడతారా... వైరల్ అవుతున్న వీడియో
- కేరళ ప్రీమియర్ లీగ్ లో విచిత్ర క్యాచ్
- వీపుపై పడిన బంతి...
- రెండు చేతులు వెనక్కి పెట్టి బంతి కిందపడకుండా మేనేజ్ చేసిన వికెట్ కీపర్
క్రికెట్ లో నాలుగైదు అడుగులు డైవ్ చేసి క్యాచ్ పడితే వావ్ అంటాం. లేకపోతే తల మీదుగా దూసుకెళుతున్న బంతిని షార్ప్ గా ఒడిసిపడితే అద్భుతమైన క్యాచ్ అని ప్రశంసిస్తాం. కానీ ఈ వీడియోలో ఓ వికెట్ కీపర్ పట్టిన క్యాచ్ ను చూస్తే దాన్ని విచిత్రమైన క్యాచ్ అంటారు. ఇలాంటి క్యాచ్ ను ఇప్పటిదాకా క్రికెట్ చరిత్రలో ఎవరూ పట్టి ఉండరేమో!
కేరళ ప్రీమియర్ లీగ్ (కేపీఎల్) ఈ క్యాచ్ ఆవిష్కృతమైంది. కేపీఏ, కాలికట్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుండగా... కాలికట్ బ్యాట్స్ మన్ సందీప్ ఇచ్చిన క్యాచ్ ను పట్టుకునేందుకు వికెట్ కీపర్ కుడిచేతి వైపుకు డైవ్ చేశాడు. అయితే ఆ బంతి అతడి చేయి తగిలి వీపుపై పడింది. బోర్లాపడిపోయిన ఆ కీపర్ రెండు చేతులు వెనక్కి పెట్టి, వీపుపై పడిన బంతి కిందపడకుండా చూసుకున్నాడు.
దాన్ని క్యాచ్ గా పరిగణనలోకి తీసుకున్న అంపైర్... బ్యాట్స్ మన్ సందీప్ ను అవుట్ గా ప్రకటించాడు. ఇక, కేపీఏ జట్టు సభ్యులందరూ వచ్చి, అద్భుతంగా క్యాచ్ పట్టావంటూ వికెట్ కీపర్ ను అభినందనల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.