Bandi Sanjay: సిరిసిల్లలో రాణిరుద్రమ గెలుపు ఖాయం: కేటీఆర్‌పై బండి సంజయ్ తీవ్ర విమర్శలు

Rani Rudrama will win Siricilla

  • సిరిసిల్లలో సామంతరాజుల పాలన నడుస్తోందని విమర్శలు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు అవినీతిపరులన్న బండి సంజయ్
  • బీజేపీ అధికారంలోకి వస్తే మచ్చలేని బీసీ నాయకుడు సీఎం అవుతారన్న ఎంపీ

సిరిసిల్లలో రాణిరుద్రమ గెలుపు ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ షాడో ముఖ్యమంత్రి అని, సిరిసిల్లలో సామంతరాజుల పాలన నడుస్తోందని విమర్శించారు. సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు అవినీతిపరులు అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మచ్చలేని బీసీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారన్నారు. కేటీఆర్... నిన్ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దమ్ము మీ అయ్యకు ఉందా? అని ప్రశ్నించారు. బీసీని ముఖ్యమంత్రి చేస్తామంటే గుణం ముఖ్యమని బీసీలను అవమానిస్తావా? అని దుయ్యబట్టారు. సిరిసిల్లకు ఆయన చేసిందేమీ లేదన్నారు. చినుకులు పడితే మునిగిపోయే సిరిసిల్ల అన్నారు. ఎంపీ ఎన్నికల్లో మాదిరిగా సిరిసిల్లలో సైలెంట్ ఓటింగ్ తథ్యమని, రాణిరుద్రమ గెలుస్తారన్నారు.

కోనప్పా... ఇక ఆంధ్రా వెళ్లిపో...

తెలంగాణ సమాజం కేసీఆర్ అరాచక పాలనను పాతరేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సిర్పూర్ కాగజ్‌నగర్ లో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే వెంటనే ఆ ప్రభుత్వాలు కుప్పకూలుతాయన్నారు. తెలంగాణలో బీజేపీ తొలి గెలుపు సిర్పూర్‌దే అన్నారు. కోనప్పా... ఇగ చాలప్పా... ఆంధ్రా వెళ్లిపో... అని చురకలు అంటించారు. సిర్పూర్ మిల్లులో ఉద్యోగాలియ్యకుండా స్థానికుల పొట్టకొడతావా? అని మండిపడ్డారు. చేసిన తప్పులకు రాజీనామా చేసి వెళ్లిపోక మళ్లీ ఓట్లడుగుతావా? అన్నారు. 50 లక్షల నిరుద్యోగుల జీవితాలను నాశనం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని ధ్వజమెత్తారు. ఉద్యోగాలు లేక ఇంటికి బరువైన యువతను చూసి తల్లిదండ్రులు గుండెపగిలి రోదిస్తున్నారన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్‌లో గోండు ఖిల్లాను కబ్జా చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదన్నారు. మజ్లిస్ నేతలు రెచ్చిపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సిర్పూర్‌లో బీజేపీ సత్తా చాటాలన్నారు.

Bandi Sanjay
BJP
Telangana
Telangana Assembly Election
rani rudrama
  • Loading...

More Telugu News