patel ramesh reddy: టిక్కెట్ రాకపోవడంతో బోరున విలపించిన పటేల్ రమేశ్ రెడ్డి, కుటుంబ సభ్యులు... ఇండిపెండెంట్‌గా నామినేషన్!
- రాంరెడ్డి వెంకటరెడ్డికి దక్కిన సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్
- మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకే తనపై కుట్రపన్నారన్న పటేల్ రమేశ్ రెడ్డి
- సూర్యాపేటలో తుంగతుర్తి కాంగ్రెస్ నేతల పెత్తనం ఎక్కువైందని విమర్శలు
- స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని వెల్లడి
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్ నేత పటేల్ రమేశ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అధిష్ఠానం టిక్కెట్ కేటాయించింది. తమకు టిక్కెట్ రాలేదని తెలియగానే రమేశ్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పార్టీని నమ్ముకొని ఇన్నాళ్లు పని చేస్తే అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్ రాకపోవడంపై పటేల్ రమేశ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనకు సీనియర్ నేతల వల్లే టిక్కెట్ రాలేదన్నారు. మంత్రి జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకు తనను పక్కన పెట్టారని ఆరోపించారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తానని స్పష్టం చేశారు.
సూర్యాపేటలో తాను గెలుస్తానని వివిధ సర్వేలలో తేలిందని, చిన్న పిల్లలను అడిగినా తాను గెలుస్తానని చెబుతారని, కానీ తనకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు. 2018లో జరిగిందే తనకు పునరావృతమైందన్నారు. ఇన్నాళ్లు పార్టీని కాపాడుకుంటే తనకు టిక్కెట్ దక్కలేదన్నారు. కుట్రపూరితంగానే తనకు టిక్కెట్ ఇవ్వలేదన్నారు. జిల్లాకు చెందిన పెద్ద నాయకుడు ఒకరు... జగదీశ్ రెడ్డిని గెలిపించేందుకు తనకు టిక్కెట్ రాకుండా చేశారన్నారు. పార్టీ నిర్ణయాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. సూర్యాపేటలో తుంగతుర్తికి చెందిన కాంగ్రెస్ నేతల పెత్తనం ఎక్కువైందన్నారు.