CI Murder Case: కానిస్టేబుల్ భార్యపై సీఐ మోజు.. ప్రవర్తన మార్చుకోకపోవడం వల్లే హత్య.. మహబూబ్‌నగర్ కేసులో వెలుగులోకి అసలు విషయం!
- ఈ నెల 1న సీఐ ఇఫ్తికార్ అహ్మద్‌పై కానిస్టేబుల్ దంపతుల దాడి
- పరారీలో ఉన్న కానిస్టేబుళ్లు శకుంతల, జగదీశ్ అరెస్ట్
- మరో నిందితుడి కోసం గాలింపు
- హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ సీఐ మృతి
సంచలనం సృష్టించిన మహబూబ్‌నగర్ సీసీఎస్ సీఐ ఇఫ్తికార్ అహ్మద్ హత్యకేసులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తన భార్య విషయంలో ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించినా వినకపోవడం వల్లే కానిస్టేబుల్ ఆయనను హత్యచేసినట్టు తేలింది.
పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ మొదటి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ జగదీశ్, ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శకుంతల 2011లో ప్రేమ వివాహం చేసుకున్నారు. 2018లో ఎస్పీ కార్యాలయంలో డీసీఆర్బీ సీఐగా పనిచేస్తున్న ఇఫ్తికార్ అహ్మద్‌కు శకుంతలతో పరిచయం అయింది. ఆ తర్వాత ట్రాన్స్‌ఫర్‌పై వెళ్లిపోయిన అహ్మద్.. నిరుడు డిసెంబరు 10న తిరిగి మహబూబ్‌నగర్ వచ్చాడు. అప్పటి నుంచి మళ్లీ శకుంతల ఫోన్‌కు మెసేజ్‌లు పంపుతున్నాడు.
భర్త ఇంట్లోనే ఉన్నాడని చెప్పినా..
అహ్మద్ ప్రవర్తనతో విసిగిపోయిన జగదీశ్, శకుంతల కలిసి ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరిస్తూ కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ పద్ధతి మార్చుకోని సీఐ ఈ నెల 1న శకుంతలకు మళ్లీ మెసేజ్ చేస్తూ రాత్రి ఇంటికి వస్తానని మెసేజ్ చేశాడు. తన భర్త ఇంట్లోనే ఉన్నాడని చెప్పినా వినిపించుకోకుండా రాత్రి 11.20 గంటలకు ఆమె ఉండే మర్లు సమీపంలోని ఎస్సార్‌నగర్‌కు కారులో వచ్చాడు. ఇంటి సమీపంలో కారు ఆపి ఇంటికొచ్చి డోర్ కొట్టాడు.
ఉప్పందించిన సహాయకుడు
జగదీశ్ ఇంటిలోనే చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఇంటి పనుల్లో సహాయకారిగా ఉంటున్న కృష్ణ అది చూసి జగదీశ్‌కు సమాచారం అందించాడు. వెంటనే ఇంటికి చేరుకున్న జగదీశ్ తన భార్యతో మాట్లాడుతున్న సీఐపై దాడి చేశాడు. కృష్ణ అతడికి సాయం చేశాడు. వారిని తప్పించుకుని పరిగెత్తుకుంటూ రోడ్డుపైకి వచ్చిన సీఐపై అక్కడ మరోమారు దాడిచేయడంతో ఆయన స్పృహ కోల్పోయాడు. దీంతో ఆయనను కారు వెనక సీట్లోకి ఎక్కించారు.
బండరాయితో తలపై మోది..
అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన జగదీశ్ తాను విధుల్లో ఉన్నట్టు నమ్మించేందుకు ఏఎస్ఐతో దిగిన ఫొటోను పోలీసు గ్రూపులో పోస్టు చేశాడు. మరోవైపు, కారును కొంతదూరం తీసుకెళ్లిన కృష్ణ ఓ చోట వదిలేసి తిరిగి ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారుజామున 3.36 గంటలకు మళ్లీ కారు వద్దకు వెళ్లి సీఐని బయటకు దించి పెద్దరాయితో తలపై మోదారు. ఆపై కత్తితో విచక్షణ రహితంగా గాట్లు పెట్టారు. కత్తిని అక్కడే ఓ డ్రైనేజీలో పడేసి ఇంటికెళ్లి విషయం శకుంతలకు విషయం చెప్పారు. రక్తపు మరకలు పడిన వారి దుస్తులను ఆమె కాల్చేసి ఆధారాలు మాయం చేసేందుకు ప్రయత్నంచింది.
అన్న సలహాతో పోలీసులకు సమాచారం
తర్వాతి రోజు ఉదయం విషయాన్ని శకుంతల తన అన్నకు ఫోన్ చేసి చెప్పగా ఆయన పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పడంతో ఎస్పీకి, సీఐకి ఫోన్ చేసింది. అనంతరం కృష్ణతో కలిసి ముగ్గురూ పరారయ్యారు. మరోవైపు, వీరి దాడిలో తీవ్రంగా గాయపడిన సీఐ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు నిన్న హైదరాబాద్‌లోని ఓ నర్సరీ వద్ద జగదీశ్ దంపతులను అరెస్ట్ చేశారు. కృష్ణ ఇంకా పరారీలోనే ఉన్నట్టు పేర్కొన్నారు.