Cricket: సెమీ ఫైనల్‌లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు అవకాశం.. సమీకరణాలు ఇవే!

Possibility of India vs Pakistan match in semi final

  • ఇంగ్లండ్‌పై పాక్ గెలుపుతోపాటు.. కీలకమవనున్న నెట్ రన్‌రేటు
  • తమ చివరి మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ ఓడిపోతే పాక్ సెమీస్ చేరే అవకాశం
  • అనూహ్యంగా మూడు జట్లు ఓడిపోతే రన్‌రేట్ ఆధారంగా ఖరారు కానున్న సెమీస్ బెర్త్

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 లీగ్ దశ ముగింపునకు చేరుకుంది. జట్లు అన్నీ మరో మ్యాచ్ ఆడితే లీగ్ దశ ముగిసిపోనుంది. అయినప్పటికీ సెమీస్ బెర్తులపై ఇంకా స్పష్టత రాలేదు. 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా, చెరో 12 పాయింట్లతో వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్న దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి. తమ చివరి మ్యాచ్‌ల్లో ఫలితాలు ఏవిధంగా ఉన్నా సెమీస్‌లో దక్షిణాఫ్రికా వర్సెస్ ఆసీస్ తలపడడం ఖాయమైంది. అయితే అగ్రస్థానంలో ఉన్న టీమిండియాతో సెమీ ఫైనల్ ఆడబోయే జట్టు ఏదో ఇంకా తేలలేదు. పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో నిలిచే జట్టుతో టీమిండియా తలపడాల్సి ఉంటుంది.

అయితే నాలుగవ సెమీస్ బెర్త్‌కి అర్హత సాధించేందుకు న్యూజిలాండ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు అవకాశాలున్నాయి. ఇప్పటివరకు 8 చొప్పున మ్యాచ్‌లు ఆడిన ఈ జట్లు 4 విజయాలు సాధించి సమానస్థాయిలో ఉన్నాయి. అయితే మెరుగైన రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 4వ స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 5వ, ఆఫ్ఘనిస్థాన్ 6వ స్థానాల్లో నిలిచాయి. దీంతో ఈ జట్లు ఆడబోయే చివరి మ్యాచ్‌ల ఫలితాలు సెమీస్‌ ఆడబోయే జట్టుని తేల్చబోతున్నాయి.

అయితే సెమీ ఫైనల్‌లో టీమిండియాతో పాకిస్థాన్ తలపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకోసం పాకిస్థాన్ తన చివరి మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించాల్సి ఉంటుంది. అదే సమయంలో న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ తమ ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి పాలవ్వాలి. ఒకవేళ తమ ప్రత్యర్థులపై కివీస్, ఆఫ్ఘనిస్థాన్ గెలిచినా పాకిస్థాన్ మెరుగైన రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంటుంది. ఎవరూ ఊహించని విధంగా ఈ మూడు జట్లు చివరి మ్యాచ్‌ల్లో పరాజయం పాలైతే అప్పుడు కూడా నెట్ రన్‌రేట్ కీలకపాత్ర పోషించనుంది. ఈ సమీకరణాలన్నీ ఫలితంగా పాకిస్థాన్ సెమీస్‌లో నాలుగవ బెర్త్ సాధిస్తే అగ్రస్థానంలో ఉన్న టీమిండియాతో తలపడాల్సి ఉంటుంది. ఈ సమీకరణాలన్నీ ఫలిస్తే సెమీఫైనల్లో మరోసారి ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ను క్రికెట్ ఫ్యాన్స్ వీక్షించవచ్చు.

More Telugu News