Bihar: నితీశ్ స్పీచ్ వినలేక అసెంబ్లీ బయటికొచ్చి మహిళా ఎమ్మెల్యే కంటతడి.. వీడియో ఇదిగో!
- సెక్స్ ఎడ్యుకేషన్ బోధించడానికి ఆయనెవరంటూ మండిపాటు
- మహిళలను అవమానించడమేనన్న బీజేపీ ఎమ్మెల్యే నివేదితా సింగ్
- అసెంబ్లీలో ఆయన స్పీచ్ మహిళలందరికీ అవమానమేనని విమర్శ
నిండు సభలో బీహార్ ముఖ్యమంత్రి నోటివెంట అలాంటి ప్రసంగం వినలేక పోయానంటూ బీజేపీ ఎమ్మెల్యే నివేదితా సింగ్ చెప్పారు. తనతో పాటు మరో ఏడెనిమిది మంది మహిళా సభ్యులు అప్పుడు అసెంబ్లీలో ఉన్నారని వివరించారు. ‘తమ లీడర్ ప్రసంగాన్ని వినాలని వారు అనుకోవచ్చు.. దానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ఆ మాటలు మాత్రం నేను వినలేక పోయా’ అంటూ నివేదిత కన్నీటిపర్యంతమయ్యారు. మహిళలందరినీ ముఖ్యమంత్రి బహిరంగంగా, అసెంబ్లీ వేదికగా అవమానించారని చెప్పారు. నితీశ్ ప్రసంగం సెక్స్ ఎడ్యుకేషన్ అంటూ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సమర్థించడాన్ని నివేదిత తప్పుబట్టారు.
‘మూసిన గది తలుపుల వెనక ఏం జరుగుతుందో ఈ రోజుల్లో అందరికీ తెలుసు.. యువత స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు, యూట్యూబ్ చూస్తున్నారు. సెక్స్ ఎడ్యుకేషన్ తెలియందెవరికి? ఈయన (నితీశ్) ఎవరు బోధించడానికి?’ అంటూ ఎమ్మెల్యే నివేదిత మీడియా ముందు తీవ్రంగా మండిపడ్డారు. మన వెంట ఉండే వారి ప్రభావం మనపై తప్పకుండా పడుతుందని ఎమ్మెల్యే చెప్పారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన నితీశ్ కుమార్.. పదో తరగతి కూడా పాస్ కాని తేజస్వీ యాదవ్ సహవాసంలో ఇలా తయారయ్యారని నివేదిత విమర్శించారు.