Nagpur: ‘టీ’ తీసుకురాలేదని సర్జరీని మధ్యలోనే ఆపేసిన డాక్టర్!

Nagpur doctor leaves surgery midway for not getting tea

  • ట్యూబెక్టమి సర్జరీ చేయకుండా ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయిన వైద్యుడు
  • నాగ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వెలుగులోకి వచ్చిన ఘటన
  • విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్న జిల్లా అధికారులు

‘కప్పు టీ’ తీసుకురాలేదనే అసహనంతో ఓ వైద్యుడు సర్జరీని మధ్యలోనే ఆపి వేసిన ఘటన నాగ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. నగరంలోని మౌడా ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. డాక్టర్ భాలవి ఆసుపత్రి సిబ్బందిని ఒక కప్పు టీ ఇవ్వాలని కోరారు. కానీ అందివ్వకపోవడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయారు. స్టెరిలైజేషన్ సర్జరీని (ట్యూబెక్టమి) సగంలోనే వదిలేసి వెళ్లారు. సర్జరీల కోసం 8 మంది మహిళలను హాస్పిటల్‌కు పిలిపించారు. అప్పటికే అనస్థీషియా ఇవ్వడంతో నలుగురు మహిళలు మత్తులోకి జారుకుని ఉన్న సమయంలో డాక్టర్ భాలవి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ మొదలుపెట్టారు.

బాధిత మహిళల కుటుంబ సభ్యులు జిల్లా వైద్యాధికారిని సంప్రదించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందిత వైద్యుడు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆస్పత్రికి మరో వైద్యుడిని పిలిపించినట్టు జిల్లా మెడికల్ ఆఫీసర్ వెల్లడించారు. ఈ నిర్లక్ష్యపూరిత ఘటనపై నాగ్‌పూర్ జిల్లా పరిషత్ సీఈవో సౌమ్యశర్మ స్పందించారు. ఘటనపై విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కమిటీ నివేదిక ఆధారంగా వైద్యుడిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

More Telugu News