Glenn Maxwell: మ్యాక్స్ వెల్ 'డబుల్' విధ్వంసం... నమ్మశక్యం కాని రీతిలో గెలిచిన ఆసీస్

Glenn Maxwell sensational innings hands Aussies unbelievable victory

  • ఆఫ్ఘనిస్థాన్ కు గుండెకోత
  • గెలవాల్సిన మ్యాచ్ లో చేజేతులా ఓడిన ఆఫ్ఘన్
  • మ్యాక్స్ వెల్ క్యాచ్ మిస్ చేసిన ముజీబ్
  • డబుల్ సెంచరీతో చెలరేగి ఆసీస్ ను గెలిపించిన మ్యాక్స్ వెల్

ముంబయి వాంఖెడే స్టేడియంలో అద్భుతం ఆవిష్కృతమైంది. ఆఫ్ఘనిస్థాన్ తో పోరులో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ మరో సంచలనం సాధించడం లాంఛనమేనని అందరూ భావించారు. అసలు, ఆసీస్ ఆటగాళ్లే తమ జట్టు గెలుస్తుందని అనుకుని ఉండరు. 

కానీ గ్లెన్ మ్యాక్స్ వెల్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మ్యాక్స్ వెల్ ఇచ్చిన క్యాచ్ ను ముజీబ్ జారవిడవడం ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు టోర్నీలో సెమీస్ చాన్సును దూరం చేసింది. ఆ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన మ్యాక్స్ వెల్ ఆ తర్వాత ప్రళయకాల రుద్రుడిలా డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు. 

ఆఫ్ఘన్ బౌలింగ్ ను అలా ఇలా కొట్టలేదు... కొడితే బంతి స్టాండ్స్ లో పడాలి అన్నంత కసిగా కొట్టాడు. మ్యాక్స్ వెల్ విజృంభణతో 292 పరుగుల టార్గెట్ కూడా చూస్తుండగానే కరిగిపోయింది. ఈ డాషింగ్ బ్యాట్స్ మన్ 128 బంతుల్లోనే 201 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మ్యాక్స్ వెల్ స్కోరులో 21 ఫోర్లు, 10 సిక్సులు ఉన్నాయంటే అతడి విధ్వంసం ఏ రీతిన సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

మధ్యలో కాలి కండరాలు పట్టేసి నిలబడడానికే ఇబ్బంది పడిన మ్యాక్స్ వెల్ మొండిపట్టుదలతో ఇన్నింగ్స్ కొనసాగించి ఆసీస్ జట్టుకు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు. మ్యాక్సీ చలవతో ఆసీస్ ఈ మ్యాచ్ లో 46.5 ఓవర్లలో 7 వికెట్లకు 293 పరుగులు చేసి విజయభేరి మోగించింది. 

కండరాలు పట్టేయడం అనేది క్రీడాకారులకు అత్యంత దుర్భరమైన గాయం. అలాంటి గాయాన్ని పంటి బిగువున భరిస్తూ మానవమాత్రుడేనా అనిపించేలా మ్యాక్స్ వెల్ వీరోచిత ఇన్నింగ్స్ కొనసాగించాడు. వరల్డ్ కప్ చరిత్రలో ఆసీస్ కు ఇదే అత్యధిక ఛేదన కాగా, మ్యాక్స్ వెల్ వన్డేల్లో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు పుటల్లోకెక్కాడు.

ఇదంతా ఒకెత్తయితే, మ్యాక్స్ వెల్ కు సహకారం అందించిన ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఆట మరో ఎత్తు. ఎక్కడా సహనం కోల్పోకుండా, తన వికెట్ ను కాపాడుకుంటూ, మ్యాక్స్ వెల్ కు స్ట్రయికింగ్ ఇస్తూ, ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లిన తీరు అమోఘం. డిఫెన్స్ కే ప్రాధాన్యత ఇచ్చిన కమిన్స్... అప్పుడప్పుడు సింగిల్స్ తీస్తూ, అత్యధిక శాతం మ్యాక్సీకి స్ట్రయికింగ్ ఇచ్చాడు. కమిన్స్ 68 బంతులాడినా చేసింది 12 పరుగులే. అందులో ఒక్క ఫోర్ మాత్రమే ఉంది.

ఇక, ఈ విజయంతో ఆసీస్ సెమీస్ లోకి దూసుకెళ్లింది. టోర్నీలో ఆసీస్ ఇప్పటివరకు 8 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించింది. అటు, గెలవాల్సిన మ్యాచ్ లో ఒక్క క్యాచ్ జారవిడిచి ఏకంగా మ్యాచ్ నే కోల్పోయిన ఆఫ్ఘనిస్థాన్ కు గుండె పగిలినంత పనైంది. మ్యాక్స్ వెల్ 33 పరుగుల వద్ద ఉన్నప్పుడు ముజీబ్ ఆ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ, మ్యాచ్ లో చివరి బంతి ముగిసే వరకు మ్యాచ్ ముగిసినట్టు కాదని, ఓడిపోయినట్టు కాదని క్రికెట్ లో ఓ నానుడి ఉంది. ఇప్పుడు దాన్ని మ్యాక్స్ వెల్ నిజం చేసి చూపించాడు.

More Telugu News