Vanjangi viewpoint: వనజంగి వ్యూపాయింట్ సందర్శకులు ఇక ఫీజు చెల్లించాల్సిందే..!
- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మేఘాల కొండపైకి ప్రైవేట్ వెహికల్స్ బ్యాన్
- జీప్ రైడ్ కు తలా రూ.150 నిర్ణయించిన జిల్లా యంత్రాంగం
- వాహన కాలుష్య నియంత్రణలో భాగంగా నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం మేఘాల కొండకు వెళ్లే పర్యాటకుల నుంచి ఫీజు వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. సూర్యోదయం అందాలను వీక్షించడానికి ఇప్పటి వరకు వనజంగి వ్యూ పాయింట్ కు స్వంత వాహనాల్లో వెళ్లే వెసులుబాటు ఉండేది. ఇకపై ఘాట్ రోడ్ లో ప్రైవేట్ వెహికల్స్ ను అనుమతించబోమని అధికారులు చెప్పారు. ఘాట్ రోడ్ ఎంట్రీ దగ్గర వాహనాలను పార్క్ చేసి, జీప్ రైడ్ బుక్ చేసుకోవాలని చెప్పారు. పార్కింగ్ కు రూ.50, జీప్ రైడ్ కు తలా రూ.150 చొప్పున ధరలను నిర్ణయించినట్లు తెలిపారు. పిల్లలకు ఎలాంటి చార్జీ లేదని వివరించారు.
ఘాట్ రోడ్ పై డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని, డ్రైవర్లు అందరికీ ఆ నైపుణ్యం ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రమాదాల నివారణతో పాటు పొల్యూషన్ నియంత్రణలో భాగంగానే మేఘాల కొండపైకి ప్రైవేట్ వాహనాలను అనుమతించకూడదని నిర్ణయించామన్నారు. ప్లాస్టిక్ బ్యాన్ కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. పర్యాటకులలో అవగాహన కల్పించడంతో పాటు వ్యూ పాయింట్ వద్ద శుభ్రత కోసం వాలంటీర్లను నియమించినట్లు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఈ వ్యూ పాయింట్ కు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు పర్యాటకులను అనుమతిస్తారు. ఇటీవలి కాలంలో పర్యాటకుల రద్దీ పెరగడంతో అధికారులు స్పందించి కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టారు.