Cricket: ఎంఎస్ ధోనీతో స్నేహంపై నిజాన్ని ఒప్పుకున్న యువరాజ్ సింగ్!
- అంత మంచి స్నేహితులం కాదని చెప్పిన యూవీ
- మైదానం వెలుపల ఇద్దరి లైఫ్ స్టైల్స్ విభిన్నమని వ్యాఖ్య
- ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడి
ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్‌ల గురించి పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. మాజీ క్రికెటర్లు అయిన వీరిద్దరూ ఇండియన్ క్రికెట్‌కు విశిష్ట సేవలు అందించారు. జాతీయ జట్టుకు ఆడుతున్న సమయంలో ఎన్నో అద్భుతాలు చేసి తమకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. రిటైర్మెంట్ అనంతరం వీరిద్దరూ వ్యక్తిగత జీవితాలను ఆస్వాదిస్తున్నారు. అయితే వీరిద్దరి మధ్య స్నేహానికి సంబంధించి చాలాకాలంగా ఊహాగానాలు ఉన్నాయి. మైదానం వెలుపల వీరిద్దరికి పడదని ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య వ్యక్తిగత బంధంపై యువరాజ్ సింగ్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ధోనీ, తాను అంత మంచి స్నేహితులం కాదని యువరాజ్ సింగ్ అన్నాడు. అంత సాన్నిహిత్యం లేదని చెప్పాడు. టీమిండియాకి కలిసి ఆడాం కాబట్టి స్నేహితులం అయ్యామని, మైదానం వెలుపల ఇద్దరి లైఫ్ స్టైల్స్ పూర్తి విభిన్నంగా ఉంటాయని యువరాజ్ చెప్పారు. క్రికెట్‌లో సహచరులంతా మంచి స్నేహితులుగా ఉండాలనేం లేదని అభిప్రాయపడ్డాడు. ‘టీఆర్ఎస్ క్లిప్స్’ అనే యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఈ విషయాలను వెల్లడించారు.
మహి లైఫ్‌స్టైల్ చాలా భిన్నంగా ఉండేదని అందుకే మంచి స్నేహితులంకాలేదని అన్నాడు. అయితే మైదానంలో ఇద్దరం కలిసి భారత్‌కు 100 శాతానికిపైగా గెలుపు కోసం ఆడామని చెప్పాడు. ధోనీ కెప్టెన్‌గా తాను వైస్ కెప్టెన్‌గా ఆడామని, కెప్టెన్-వైస్ కెప్టెన్ అయినప్పుడు నిర్ణయాల విషయాల్లో వ్యత్యాసాలు ఉంటాయని అభిప్రాయపడ్డాడు. కొన్నిసార్లు ధోని తనకు నచ్చని నిర్ణయాలు తీసుకున్నాడని, ఇంకొన్నిసార్లు అతడు ఇష్టపడని నిర్ణయాలు తాను తీసుకున్నానని చెప్పాడు. ప్రతి జట్టులో ఇది జరిగేదేనని అభిప్రాయపడ్డాడు.
తన కెరియర్ ముగింపు దశలో ఉన్నప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో పాలుపోని స్థితిలో సలహా ఇవ్వాలని ఎంఎస్ ధోనీని అడిగానని యువరాజ్ చెప్పాడు. ప్రస్తుతం సెలక్షన్ కమిటీ తనవైపు చూడటం లేదని చెప్పిన వ్యక్తి ధోనీనే అని పేర్కొన్నాడు. 2019 ప్రపంచ కప్‌కి ముందు ఇది జరిగిందని, ఇదే వాస్తవమని యువరాజ్ తెలిపాడు.