S.Somanath: ఒక్కోసారి కనీస గౌరవం కూడా దక్కదు: ఇస్రో చీఫ్
- చంద్రయాన్-3 విజయం అనంతరం మీడియాతో ఇస్రో చీఫ్ పలు కీలక వ్యాఖ్యలు
- తన నైపుణ్యాలపైనే సందేహాలు వ్యక్తమయ్యాయని వ్యాఖ్య
- ఆత్మకథ కాంట్రవర్సీ నేపథ్యంలో పాత వ్యాఖ్యలు తెరపైకి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చీఫ్ తన ఆత్మకథలో ఇస్రో మాజీ చైర్మన్ కే శివన్‌ను టార్గెట్ చేసుకున్నారన్న వార్తల నడుమ ఆయన పుస్తకావిష్కరణ వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. తాను ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదని వివరణ ఇచ్చుకున్నాక ఆయన పుస్తకావిష్కరణను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఈ కాంట్రవర్సీ తెరమీదకు రాకమునుపే ఆయన జాతీయ మీడియాతో తన కెరీర్‌కు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 మిషన్ విజయం అనంతరం ఆయన పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు.
‘‘నా జీవితంలో అందరూ నాతో మంచిగా ప్రవర్తించారని నేను అనుకోవట్లేదు. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. నిన్ను (తన గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ..) సడెన్‌గా సంస్థ నుంచి తొలగించొచ్చు. లేదా నీ స్థానానికే ప్రమాదం ఏర్పడొచ్చు. కొన్ని సార్లు నీకు కనీస గౌరవం కూడా దక్కకపోవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.
తాను అనేక విమర్శలు ఎదుర్కొన్నానని, తన నైపుణ్యాలపై సందేహాలు కూడా వ్యక్తమయ్యాయయని తెలిపారు. కానీ ఇలాంటి వాటిని ఎలా అధిగమించాలో తాను నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు.