KTR: తమ్ముడూ.. అన్నీ తెలిసి అటు ఎందుకు వెళ్లావు?: ఏనుగుల రాకేశ్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా కేటీఆర్
- కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన రాకేశ్ రెడ్డి
- బీజేపీలో పదేళ్లు ఉండి ఆ పార్టీ కోసం ఎంత గట్టిగా పని చేశావో.. బీఆర్ఎస్ కోసం అలాగే చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి
- ఉడుతా భక్తిలా పని చేస్తానని రాకేశ్ రెడ్డి మంచి మాట చెప్పారన్న కేటీఆర్
ఇటీవల బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేసిన ఏనుగుల రాకేశ్ రెడ్డి శనివారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాకేశ్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. వరంగల్ వెస్ట్ నుంచి బీజేపీ టిక్కెట్ ఆశించారు రాకేశ్ రెడ్డి. తనకు టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన రెండు రోజుల క్రితం పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత రాకేశ్ రెడ్డిని కడియం శ్రీహరి ఆయన నివాసంలో కలిసి, బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. దీంతో ఇవాళ ఆయన అధికార పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ... ఇప్పుడు తమ్ముడు రాకేశ్ మాట్లాడుతుండగా తాను మనసులో ఓ మాట అనుకున్నానని, కేసీఆర్ ప్రవేశపెట్టిన అన్ని స్కీములను ఆయన చెప్పాడని, కేసీఆర్ ఎంతో చేశాడని చెప్పాడని, కానీ అన్నీ తెలిసి ఇన్నిరోజులు అటు (బీజేపీ) ఎందుకు ఉన్నావు తమ్ముడు? అని నవ్వుతూ అడిగారు. 'అన్నీ తెలుసు... మనసులో ప్రేమ ఉంది.. కాకపోతే రాజకీయం కాబట్టి అటు ఉండాలి కాబట్టి.. విమర్శలు చేయాలి కాబట్టి చేశాడు' అంటూ భుజం తట్టాడు.
బీజేపీలో పదేళ్లు ఉండి ఆ పార్టీ కోసం ఎంత గట్టిగా పని చేశావో రేపటి రోజు ఇక్కడ (బీఆర్ఎస్ కోసం) అంతకంటే ఎక్కువ పని చేయాలని రాకేశ్ రెడ్డికి కేటీఆర్ సూచించారు. పార్టీ కోసం ఓ సైనికుడిలా పని చేయాలన్నారు. తాను ఉడుతా భక్తిలా పని చేస్తానని రాకేశ్ రెడ్డి మంచి మాట చెప్పారన్నారు. ఎవరైనా మొదట కార్యకర్తలమే అన్నారు. తాను కూడా రాకేశ్ రెడ్డిలా 2004లో అమెరికాలో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఇక్కడే ఉద్యోగం సంపాదించుకొన్నానని, నెలకు తనకు నాలుగున్నర లక్షలు వస్తుండెనన్నారు. అదే సమయంలో కరీంనగర్ నుంచి కేసీఆర్ రాజీనామా చేశారని, ఆ సమయంలో ఓ తెలంగాణ బిడ్డగా తాను తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉడుతా భక్తిగా కేసీఆర్ కోసం ప్రచారం చేశానన్నారు. ప్రజల దయతో కేసీఆర్ గెలిచారని, ఆ తర్వాత తెలంగాణ వచ్చిందన్నారు.