: మెదడుకున్న శక్తి అమోఘం!
మనిషి మెదడుకున్న శక్తి అమోఘమైంది. దీంతో ఏమైనా చేయొచ్చు... ఇలాగే మెదడుతో కొందరు శాస్త్రవేత్తలు ఎంచక్కా ఒక హెలికాప్టర్‌ని నడిపేశారు. మిన్నెసోటాకు చెందిన శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించారు. మన మెదడులోని ప్రచోదనాలను ప్రత్యేకమైన టోపీ ద్వారా కంప్యూటర్‌కు చేరవేసి దాని ద్వారా హెలికాప్టర్‌ను నడిపేలా చేశారు శాస్త్రవేత్తలు.
ఇందుకోసం వారు 64 విద్యుత్ ప్రవాహ నాళాలు (ఎలక్ట్రోడ్‌లు)ను ఒక టోపీకి అమర్చి దాన్ని కంప్యూటర్‌కు అనుసంధానించారు. ఈ ప్రత్యేకమైన టోపీలను ధరించిన వారి ముందున్న కంప్యూటర్ తెరపై గాలిలో ఎగురుతున్న బుల్లి హెలికాప్టర్ కనిపించేలా ఏర్పాటు చేశారు. ఈ హెలికాప్టర్‌లో కూడా ప్రత్యేకమైన కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ కెమెరా వల్ల దాని ప్రయాణ దిశ కంప్యూటర్ తెరపై కనిపిస్తుంది. ఇదే సమయంలో కంప్యూటర్ ముందు కూర్చున్న ప్రత్యేకమైన టోపీలను ధరించినవారు తమ మెదడు ద్వారా ఇచ్చే సూచనలను, సంకేతాలను ఆ టోపీకి అమర్చి వున్న ఎలక్ట్రోడులు గ్రహించి వాటిని అనుసరించి హెలికాప్టర్‌ను నడిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. మనిషి తలుచుకుంటే ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు కదా!