Vijayasai Reddy: పురందేశ్వరిపై విమర్శల డోసు పెంచిన విజయసాయిరెడ్డి

Vijayasai Reddy once again targets Purandeswari
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్... ఖండించిన పురందేశ్వరి
  • ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ విచారణ కోరుతున్న ఏపీ బీజేపీ చీఫ్
  • పురందేశ్వరిపై తరచుగా విమర్శలు గుప్పిస్తున్న విజయసాయి
స్కిల్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి బాహాటంగా మద్దతు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తుండడం, ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని పురందేశ్వరి కోరుతుండడం వంటి అంశాల నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తరచుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా పురందేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. అంతే తప్ప, పురందేశ్వరికి బీజేపీపై ఎలాంటి ప్రేమ, అభిమానం లేవని తెలిపారు. 

మొదట టీడీపీ, ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, ఆ తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్, తిరిగి బీజేపీ... ఇలా వరుసగా నాలుగు పార్టీలు మారిన ఘనత పురందేశ్వరిదని విజయసాయి వెల్లడించారు. 

"ఆమె బీజేపీలో చేరిన తర్వాత ఆమె వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే అదీ లేదు. పైగా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారని చెప్పాలి" అని పేర్కొన్నారు. 

ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? అని పురందేశ్వరిని విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో మీ నిజాయతీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి రాయగలరా? అని సవాల్ విసిరారు. 

ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి... మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీరు, మీ భర్త వెంకటేశ్వరరావు, మీ కుమారుడు హితేశ్, 'గీతం' భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా? హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారు? ఆ విల్లాకు సొమ్ములు పెడుతున్నది ఎవరు? అంటూ విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
Vijayasai Reddy
Daggubati Purandeswari
YSRCP
BJP
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News