rakesh reddy: బీజేపీకి షాక్... ఏనుగుల రాకేశ్ రెడ్డి రాజీనామా, కార్యకర్తల సమావేశంలో భావోద్వేగం

Rakesh Reddy resigns as bjp spokes person

  • వరంగల్ వెస్ట్ నుంచి టిక్కెట్ ఆశించి రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి
  • పార్టీలో అవమానాలు జరిగినా బీజేపీ కోసమే పని చేశానన్న రాకేశ్ రెడ్డి
  • ప్రజాబలం ఉన్న నాయకులను బలి చేస్తున్నారని ఆవేదన
  • ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే నేను చేసిన తప్పా? అని నిలదీత
  • కార్యకర్త స్థాయి నుంచి ఎదిగానంటూ భావోద్వేగం

బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి బుధవారం తన పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. వరంగల్ వెస్ట్ నుంచి పార్టీ టిక్కెట్ ఆశించారు. కానీ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ రోజు ఆయన క్యాంప్ కార్యాలయంలో అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ... బీజేపీ తనకు దగా చేసిందన్నారు. పార్టీలో అనేక అవమానాలు జరిగాయన్నారు. పార్టీని బలోపేతం చేసిన తనను దూరం పెట్టారన్నారు. ప్రజాబలం ఉన్న నాయకులను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా చేస్తే రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు లేదన్నారు. ఈ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా? అన్నారు. మాట్లాడితే సస్పెండ్ చేస్తారన్నారు.

తనను పార్టీ నుంచి పంపించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ కోసం ఇన్నాళ్లు కష్టపడిన తనను ఏ కార్యక్రమానికి పిలవడం లేదన్నారు. తనకు ఎన్ని అవమానాలు జరిగినా పార్టీ గీతను దాటలేదన్నారు. పార్టీకి సంబంధించి సైద్ధాంతిక భూమిక క్లాస్‌లు తానే తీసుకున్నానన్నారు. అలాంటి తాను బీజేపీ గీత దాటలేదన్నారు. తనకు మైక్ ఇవ్వాలంటే పార్టీ నేతలు ఎందుకు భయపడుతున్నారు? అని ప్రశ్నించారు. తనకు మైక్ ఇస్తే భయపడాల్సింది బీఆర్ఎస్ నాయకులని అన్నారు. కానీ సొంత పార్టీ వాళ్లే తన మైక్ లాక్కుంటారన్నారు. అసలు తాను చేసిన తప్పేమిటన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం, ప్రజావాణిని బలంగా వినిపించడమే నేను చేసిన తప్పా? అన్నారు. పార్టీని గల్లీ గల్లీకి తీసుకు వెళ్లడం నేను చేసిన తప్పా? అన్నారు.

పుట్టిన గడ్డకు సేవ చేయాలని, ప్రజాసేవలో ఉండాలని ఉన్నత ఉద్యోగాలను వదిలేసి 2013లో తాను వరంగల్‌కు వచ్చి బీజేపీలో చేరానన్నారు. ఈ పదకొండేళ్ల ప్రస్థానంలో తాను పార్టీనే కుటుంబంగా భావించానన్నారు. తాను కార్యకర్త స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను పార్టీకి అంకితమైన పని చేశానన్నారు. ఈ పదేళ్లలో కష్టాలు, నష్టాలు అవహేళనలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 52 మండలాలు తిరిగానన్నారు. యువమోర్చా నేతగా ఎంతోమంది కార్యకర్తలను తయారు చేసినట్లు చెప్పారు. పార్టీ ఎక్కడకు పంపిస్తే అక్కడకు వెళ్లానన్నారు.

More Telugu News