: ఐదున్నర కోట్లు కావాలా... అయితే ఈ లెక్కచేయండి!
మీకు ఐదున్నరకోట్లు కావాలా... అయితే ఒక్క లెక్క చేసేయండి... చక్కగా ఐదున్నరకోట్లు మీ సొంతం అవుతాయి అంటున్నారు రోడ్ ఐలాండ్‌లోని అమెరికా గణితశాస్త్ర సొసైటీ (ఏఎంఎస్) వారు. అమెరికాలోని ఈ సొసైటీ వారు గతంలో ఈ గణిత సమస్యను పరిష్కరించమని గణిత మేధావులందరికీ ఒక సవాలు విసిరారు. అప్పట్లో బహుమతి మొత్తాన్ని ఒక లక్ష డాలర్లుగా ప్రకటించారు. అయితే సుదీర్ఘకాలం పాటు ఈ సమస్య అలాగే మిగిలిపోయింది. దీన్ని ఎవరూ పరిష్కరించలేకపోయారు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించిన వారికి పది లక్షల డాలర్లు (రూ.5.67కోట్లు) ఇస్తామని బహుమతి మొత్తాన్ని పెంచి చెప్పారు. అయినా కూడా పెద్దగా స్పందన రావడం లేదు.
ఇంతకీ ఈ సమస్య ఏంటంటే, బీల్ కంజెక్చర్ అనే ఒక సంఖ్యా సిద్ధాంతానికి చెందిన సమస్య. ఈ సమస్య పరిష్కారం కోసం ఆండీ బీల్ అనే ఆయన 1997లో తొలిసారిగా బహుమతిని ప్రకటించారు. అమెరికాలోని డల్లాస్‌కు చెందిన బ్యాంకర్, వ్యాపారవేత్త అయిన ఆండ్రూ 'ఆండీ' బీల్ బహుమతి సొమ్మును సమకూర్చనున్నారు. ఈ బ్యాంకర్ పేరుమీదే ఈ బహుమతిని బీల్ ప్రైజ్ అంటారు. అయితే 1997 నుండి ఇప్పటి వరకూ ఎవరూ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు. ఈ బీల్ కంజెక్చర్‌కు రుజువును చూపినా, లేదా దీనికి పూర్తి విరుద్ధమైన ఉదాహరణను చూపినా కూడా బహుమతిని ఇస్తారు. ఇలాంటి క్లిష్టమైన గణిత సమస్య 'ఫెర్మాట్స్ లాస్ట్ ధియరం'ను 1990లో రిచర్డ్ టేలర్‌తో కలిసి ఆండ్రూ వైల్స్ నిరూపించారు. సంఖ్యా సిద్ధాంతంలో బీల్ కంజెక్చర్‌ను, ఫెర్మాట్స్ లాస్ట్ ధియరంను ప్రత్యేకమైనవిగా సంఖ్యాశాస్త్ర నిపుణులు పేర్కొంటారు. పలకడానికి ఇవి చాలా సులభంగా ఉన్నా నిరూపించడానికి అత్యంత క్లిష్టమైనవిగా ఉంటాయని నిపుణులు చెబుతుంటారు. అయితే, ఈ సవాలు విసిరిన బీల్ స్వతహాగా గణితవేత్త, ఆయనకు సంఖ్యా సిద్ధాంతంపై మక్కువ ఎక్కువే. విద్యార్ధులు గణితాన్ని, సైన్సును అభ్యసించేలా వారిలో ప్రేరణ కలిగించాలని ఆయన అనుకొన్నారు. బహుమతి మొత్తాన్ని లక్ష డాలర్ల నుండి పది లక్షల డాలర్ల వరకూ పెంచడం వల్ల బీల్ కంజెక్చర్‌పై మరింతగా గణితవేత్తల అందరి దృష్టి కేంద్రీకృతమవుతుందని ఆయన చెప్పారు.
అయితే గతంలో బీల్ కంజెక్చర్‌లాగే క్లే గణిత సంస్థ 2000 సంవత్సరంలో ఏడు సమస్యలను ఇచ్చి ఒక్కో సమస్యకు ఒక్కో లక్ష డాలర్ల నగదు బహుమతిని ప్రకటించింది. వీటిని మిలీనియం సమస్యలుగా పిలుస్తారు. వీటిలో 'పాయిన్‌కేర్ కంజెక్చర్' అనే సమస్యను రష్యా గణిత శాస్త్రవేత్త గ్రిగోరి పెరెల్ మాన్ 2003లో పరిష్కరించారు. అయితే ఆయన నగదు బహుమతిని తిరస్కరించారు.