Mohammed Shami: కపిల్ దేవ్ మాదిరే షమీ కూడా..: సునీల్ గవాస్కర్
- నెట్స్ లో అదే పనిగా సాధన చేస్తూనే ఉంటాడన్న గవాస్కర్
- ఇదే షమీ నుంచి మంచి ఫలితాలు రాబడుతుందన్న అభిప్రాయం
- ఫాస్ట్ బౌలర్ గా రాణించాలంటే సాధన అవసరమేనన్న మాజీ క్రికెటర్
భారత పేస్ బౌలర్ మహమ్మద్ షమీ తన సత్తా ఏంటో వన్డే ప్రపంచకప్ 2023 వేదికగా బాల్ తో చూపిస్తున్నాడు. నిన్నటి ఇంగ్లండ్ మ్యాచ్ లో షమీ బౌలింగ్ హైలైట్ గా నిలవడం తెలిసిందే. 7 ఓవర్లు సంధించిన షమీ నాలుగు వికెట్లు తీసి కీలకంగా వ్యవహరించాడు. పైగా ఏడు ఓవర్లలోనూ ఇచ్చిన పరుగులు ఓవర్ కు 3 మించలేదు. కీలమైన బేర్ స్టో, బెన్ స్టోక్స్, మొయిన్ అలీ వికెట్లు తీశాడు.
షమీ అద్భుతమైన బౌలింగ్ ఎటాక్ పై భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించారు. షమీని భారత్ మాజీ దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ తో పోల్చారు. ‘‘దాని వెనుక ఎంతో కష్టం దాగుంది. షమీ ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత అతడు తాను రూపొందించిన పిచ్ లపై బాల్ తో సాధన చేస్తూనే ఉంటాడు. ఇదే అత్యంత ముఖ్యమైనది. అతడు వ్యక్తిగత క్రికెట్ సామర్థ్యంపై దృష్టి పెట్టాడు. అతడిలోని ప్రత్యేకత ఏంటి? అంటే అది ఫాస్ట్ బౌలింగ్. అతడు నివసించే చోటే నెట్స్ మధ్య ఎన్నో ఓవర్ల పాటు బౌలింగ్ చేస్తుంటాడు. అతడు జిమ్ కు వెళతాడా అన్నది నాకు తెలియదు. కానీ, అంతిమంగా మహమ్మద్ షమీ అచ్చం కపిల్ దేవ్ మాదిరే చేస్తున్నాడు. నెట్స్ లో బాల్, బాల్ వేస్తుండడమే’’ అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.
‘‘వద్దు వద్దు, కేవలం 15 లేదా 20 బంతులే నెట్స్ లో వేయాలన్న బయో మెకానిక్ నిపుణుల సూచనలను అతడు వినిపించుకోవడం లేదు. ఒక ఫాస్ట్ బౌలర్ గా ఎన్నో మైళ్ల పాటు పరుగెత్తగల సామర్థ్యం కాళ్లకు ఉండాలన్న విషయం అతడికి తెలుసు. దాన్నే అతడు చూపిస్తున్నాడు. అతడి రిథమ్ కూడా ఎంతో బావుంది. అతడు బాల్ తో పరుగెత్తుతున్నప్పుడు డ్రోన్ కెమెరాతో చూస్తే చీతా మాదిరే ఉంటుంది’’ అని గవాస్కర్ షమీని మెచ్చుకున్నారు.