Virender Sehwag: మనపై ఇంగ్లండ్‌కు చాన్సే లేదు.. కుర్రాళ్లు కుమ్మేశారు: సెహ్వాగ్
- టీమిండియా అసలైన చాంపియన్‌లా ఆడిందన్న సెహ్వాగ్
- షమీ, కుల్దీప్, రోహిత్, బుమ్రా, సూర్యకుమార్‌పై ప్రశంసలు
- జట్టు ఆనందాన్ని పంచిందన్న మాజీ డ్యాషింగ్ బ్యాటర్
లక్నో మ్యాచ్‌లో టీమిండియా విజయంపై మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. ‘ఆహా ఏమా విజయం’ అని పేర్కొన్నాడు. ఇంగ్లిష్ జట్టుకు ఎలాంటి చాన్స్ ఇవ్వకుండా టీమిండియా కుమ్మేసిందన్నాడు. మన జట్టుపై ఇంగ్లండ్‌కు చాన్స్ లేదని చెప్పుకొచ్చాడు. భారత జట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. షమీ, కుల్దీప్ యాదవ్, రోహిత్‌శర్మ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ ఇరగదీశారంటూ పొగడ్తల వర్షం కురిపించాడు. భారత జట్టు అసలు సిసలైన చాంపియన్ల మాదిరి ఆడిందని, ఆనందాన్ని పంచిందని పేర్కొన్నాడు.
లక్నో మ్యాచ్‌లో తొలుత భారత జట్టు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంగ్లండ్ బౌలర్ల దెబ్బకు భారత్ 229 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రోహిత్‌శర్మ (87), రాహుల్ (39), సూర్యకుమార్ యాదవ్ (49) మినహా మిగతా వారెవరూ రాణించలేకపోయారు.
230 పరుగుల లక్ష్యం మరీ చిన్నది కావడం, దీనికి తోడు ప్రత్యర్థి ఇంగ్లండ్ కావడంతో భారత్ ఓటమి పక్కా అనే అందరూ భావించారు. అయితే, షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ రెచ్చిపోయి వికెట్లు తీడయంతో ఇంగ్లండ్ కుదేలైంది. 129 పరుగులకే కుప్పకూలి ఐదో ఓటమిని ఖాతాలో వేసుకుంది.