Bandla Ganesh: హైదరాబాదులో చంద్రబాబు కృతజ్ఞత సభ... తీవ్ర భావోద్వేగాలతో మాట్లాడిన బండ్ల గణేశ్

Bandla Ganesh gets emotional in CBN Gratitude Concert

  • సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకలు
  • హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్
  • అనూప్ రూబెన్స్ సంగీత కచేరీ
  • వేదికపై కంటతడి పెట్టుకున్న బండ్ల గణేశ్

హైదరాబాదులో ప్రఖ్యాతిగాంచిన సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా హైదరాబాదులో నేడు చంద్రబాబు గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ (కృతజ్ఞత సంగీత కచేరీ) ఏర్పాటు చేశారు. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ బృందం తమ సంగీత ప్రదర్శనతో సభకు వచ్చినవారిని ఉర్రూతలూగించింది. 

కాగా, ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూడా వచ్చారు. ఆయన వేదికపై ప్రసంగిస్తూ చంద్రబాబును వేనోళ్ల కొనియాడారు. ఓ దశలో తీవ్ర భావోద్వేగాలకు లోనైన ఆయన కంటతడి పెట్టారు. 

"నేను వినాయకచవితి పండుగ చేసుకోలేదు, దసరా పండుగ చేసుకోలేదు... దీపావళి పండుగ అద్భుతంగా చేసుకునే అవకాశం కల్పించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను. చంద్రబాబు... అది పేరు కాదు బ్రాండ్. బ్రాండ్ కూడా కాదు, మనిషి కూడా కాదు... దేవుడు. 

ఆయన దేవుడు అని ఎందుకు చెబుతున్నానంటే... మా సొంతూరు ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు దగ్గర్లోని ఓ ఊరు. నాకు ఎనిమిది నెలల వయసున్నప్పుడు మేం అక్కడ్నించి బతకడానికి ఎక్కడికో వలస వచ్చాం. అప్పుడప్పుడు మా ఊరికి వెళ్లొస్తుండేవాడ్ని. మా బంధువులందరూ పాడి పశువులతో ఉపాధి పొందుతూ, గుంటూరు, పొన్నూరులో ఉంటూ పిల్లలను ట్యూషన్ చేర్పించి చదువు చెప్పించేవాళ్లు. 

కొన్నాళ్ల తర్వాత చూస్తే... మా ఊరి నుంచి పొన్నూరుకు కాలినడకన, ఆటోల్లో వచ్చే మా పిన్ని వాళ్లు విమానాలెక్కి అమెరికా వెళుతున్నారు. ఏం పిన్ని ఎక్కడికి వెళుతున్నావు అంటే... అమ్మాయి సాఫ్ట్ వేర్ కదరా, అల్లుడు సాఫ్ట్ వేర్ కదరా... అమెరికా వెళుతున్నాను అని చెబుతుంటే కడుపు నిండిపోయినట్టయ్యేది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటూ... ఇవాళ మనవాళ్లు దేశవిదేశాల్లో ఐటీ ఉద్యోగాలతో బతుకుతున్నారంటూ దాని వెనుక చంద్రబాబు కృషి ఉంది. 

మా నాన్న వయసు 78 ఏళ్లు. చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేశార్రా అని ఆయన అడిగారు. నాన్నా... కులీకుతుబ్ షా హైదరాబాద్ ను కట్టాడు... 400 ఏళ్లయినా ఆయన పేరు చెప్పుకుంటున్నారు. అలాగే సైబర్ టవర్స్ కట్టిన చంద్రబాబును 4 వేల ఏళ్లయినా గుర్తుంచుకుంటారు అని చెప్పాను. 

శ్రీకృష్ణుడు అంతటివాడికి కూడా జైలే జన్మస్థానం అయింది... శ్రీకృష్ణుడు దేవుడు కాకుండా పోయాడా!... అరణ్యవాసం వెళ్లిన రాముడు దేవుడు కాకుండా పోయాడా!... 40 రోజులుగా జైల్లో ఉన్నంత మాత్రాన చంద్రబాబు దేవుడు కాకుండా పోతాడా నాన్నా అని అన్నాను. 

ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు జై అంటున్నారు. అమెరికాలో, ఆస్ట్రేలియాలో, హైదరాబాదులో, ఢిల్లీలో ఆయనకు జై కొడుతున్నారు. కానీ చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉంటే కడుపు తరుక్కుపోతోంది. ఏం తప్పు చేశాడని ఆయనను జైల్లో పెట్టారు? మనందరికి భవిష్యత్ ఇచ్చినందుకా ఆయన జైల్లో ఉండాలి? ఆఖరికి భార్యాబిడ్డలను కూడా పక్కనబెట్టి ప్రజల కోసం పాటుపడిన చంద్రబాబుకు ఈ పరిస్థితి వచ్చిందంటే కడుపు రగిలిపోతోంది. చంద్రబాబు కోసం ప్రాణాలిచ్చేందుకైనా సిద్ధమే. అలాంటి వ్యక్తి దేశానికి అవసరం" అంటూ బండ్ల గణేశ్ ఉద్వేగభరితంగా వ్యాఖ్యానించారు.

Bandla Ganesh
CBN Gratitude Concert
Chandrababu
Hyderabad
TDP
  • Loading...

More Telugu News