Manchu Vishnu: ‘కన్నప్ప’ షూటింగ్‌లో గాయపడ్డ మంచు విష్ణు!

Manchu Vishnu reportedly injured during Kannappa shooting
  • మంచు విష్ణు కలల ప్రాజెక్టు 'కన్నప్ప'
  • న్యూజిలాండ్ లో చిత్రీకరణ
  • యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో అపశ్రుతి!
  • మంచు విష్ణుపైకి దూసుకొచ్చిన డ్రోన్!
టాలీవుడ్ డైనమిక్ స్టార్ విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీం ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడే షూటింగ్‌ను శరవేగంగా జరుపుతున్నారు. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నప్ప షూటింగ్‌లో మంచు విష్ణు గాయపడ్డాడని, దీంతో సినిమా షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారని టాక్ వినిపిస్తోంది. 

మంచు విష్ణు ఎంతో ఇష్టంగా చేస్తున్న ఈ కన్నప్ప చిత్రంపై హైప్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్పలో భాగమైన సంగతి తెలిసిందే. ఇలా ఇంకెన్నో సర్ ప్రైజ్ క్యాస్టింగ్, ఆర్టిస్టులు కన్నప్పలో ఉన్నారని తెలుస్తోంది. 

అయితే జోరుగా షూటింగ్ జరుపుతున్న కన్నప్ప టీంకి అనుకోని ఘటన ఎదురైంది. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా... అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయని సమాచారం. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. భయపడాల్సినంత పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని సమాచారం. 

బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు. 

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి వారు రచనా సహకారం చేశారు. మిగతా నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.
Manchu Vishnu
Injury
Kannappa
Shooting
New Zealand

More Telugu News