Hamas: కేరళలో పాలస్తీనా అనుకూల సభ... వర్చువల్ గా పాల్గొన్న హమాస్ నేత... బీజేపీ ఫైర్
- కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభం
- ఇజ్రాయెల్ కు మద్దతు పలికిన భారత్
- భారత్ లో కొన్నిచోట్ల పాలస్తీనా అనుకూల కార్యక్రమాలు
- మలప్పురంలో సభ ఏర్పాటు చేసిన సాలిడారిటీ యూత్ మూవ్ మెంట్
- వర్చువల్ గా ప్రసంగించిన హమాస్ నేత ఖాలెద్ మషాల్
ఇజ్రాయెల్-హమాస్ సంక్షోభంలో భారత కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్ కు మద్దతు పలికిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ, భారత్ లో పలు చోట్ల పాలస్తీనా అనుకూల వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా కేరళలో పాలస్తీనా అనుకూల సభ జరగ్గా, అందులో హమాస్ నేత ఖాలెద్ మషాల్ వర్చువల్ గా ప్రసంగించడం తీవ్ర వివాదానికి దారితీసింది.
కేరళలోని మలప్పురంలో ఈ సభను సాలిడారిటీ యూత్ మూవ్ మెంట్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ జమాతే ఇస్లామి సంస్థకు యువజన విభాగం. ఓ వీడియోలో హమాస్ నాయకుడు ఖాలెద్ మషాల్ ప్రసంగిస్తుండడం కనిపించింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సభలో హమాస్ నేత వర్చువల్ గా పాల్గొనడంపై చర్యలు తీసుకోవాలని కేరళ బీజేపీ చీఫ్ కె.సురేంద్రన్ డిమాండ్ చేశారు. సాలిడారిటీ సంస్థ మలప్పురంలో ఏర్పాటు చేసిన సభలో హమాస్ నేత పాల్గొనడం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని సురేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం పినరయి విజయన్ పోలీసులు ఎక్కడ? అని ప్రశ్నించారు. సేవ్ పాలస్తీనా అంటూ హమాస్ ను కీర్తిస్తున్నారు... హమాస్ ఓ ఉగ్రవాద సంస్థ అయితే, దాని నేతలను యోధులు అంటున్నారు అంటూ సురేంద్రన్ మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.