Ashok Babu: సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లా... దేశంలో ఎక్కడైనా ఉందా?: అశోక్ బాబు

TDP MLC Ashok Babu press meet over registrations issue

  • రిజిస్ట్రేషన్ల వ్యవస్థను ప్రభుత్వం నీరుగార్చిందన్న అశోక్ బాబు 
  • సచివాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లపై ప్రజల్లో సందేహాలు ఉన్నాయని వెల్లడి
  • తక్షణమే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్

ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సచివాలయాలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లోపభూయిష్టం అని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ధ్వజమెత్తారు. దేశంలో ఎక్కడైనా ఇంత విడ్డూరం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సచివాలయ సిబ్బందికి అప్పగించిన ప్రభుత్వం... పారదర్శకంగా, పకడ్బందీగా జరగాల్సిన పనిని అపహాస్యంగా మార్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతోందని అశోక్ బాబు విమర్శించారు. 

రిజిస్ట్రేషన్లు సచివాలయాల్లో జరుగుతాయన్న ప్రభుత్వం, నిర్ణయం మొత్తం రిజిస్ట్రేషన్ల వ్యవస్థనే నీరుగార్చిందని అన్నారు. వ్యవస్థల్లో జగన్ రెడ్డి జోక్యం పరాకాష్ఠకు చేరిందని, మైనింగ్, రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖల వంటి ఆదాయార్జన శాఖలను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.

అశోక్ బాబు ఇవాళ మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రిజిస్ట్రేషన్ల అంశంలో ప్రభుత్వం తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త రిజిస్ట్రేషన్ విధానానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

“జగన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజా రాజధాని అమరావతిపై తన రాజకీయ కుట్రల పడగ విప్పాడో అప్పటినుంచే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయి, భూముల క్రయవిక్రయాలు మందగించాయి. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దారుణంగా పడిపోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు కూడా కొంతవరకు దోహదం చేశాయి" అని వ్యాఖ్యానించారు. 

"గతంలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు ఎంతో పారదర్శకంగా, పకడ్బందీగా జరిగేవి. కానీ జగన్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ల వ్యవహారమంతా చిల్లర వ్యాపారంగా మారిపోయింది. రిజిస్ట్రేషన్ల తంతుని సచివాలయ వ్యవస్థకు అప్పగించిన ప్రభుత్వం... గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండే సిబ్బంది, అక్కడి పరికరాలు, ఇతర పరిజ్ఞానంతో ఎంతవరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సమర్థవంతగా నిర్వహించవచ్చని ఆలోచించిందా? 

కొనుగోలు, అమ్మకందారులతో పనిలేకుండా, వారు ప్రత్యక్షంగా అందుబాటులో లేకున్నా పంచాయతీ కార్యదర్శులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్స్ కూడా తమ వద్దే ఉంచుకుంటామని, క్రయవిక్రయ దారులకు కేవలం జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తమకు ఇవ్వకుండా, తూతూ మంత్రంగా జరిగే రిజిస్ట్రేషన్లకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే సందేహం ప్రజలకు ఉంది.

సచివాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. కొత్త రిజిస్ట్రేషన్ విధానం పాలకులకే మేలు చేస్తుందని, ప్రజల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ను తనఖా పెట్టి ప్రభుత్వమే రుణాలు పొందుతోందనే ప్రచారం ఎక్కువైంది. ఇలా జరిగే ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు. 

తమ ఆస్తులు, భూములు అత్యవసరంగా అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గ్రామ సచివాలయాల్లో చేసే చట్టబద్ధం కాని రిజిస్ట్రేషన్ల వల్ల అమ్ముకునే వారికి ఎంతవరకు ఉపయోగం? రిజిస్ట్రార్ చేసే పనిని... గ్రామ కార్యదర్శులకి అప్పగించిన ప్రభుత్వం.. మున్ముందు ఎమ్మార్వోల అధికారాలను కూడా వారికే అప్పగిస్తుందేమో! 

జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల విధానంపై ఇప్పటికే హైకోర్టులో మూడు రిట్ పిటిషన్లు పడ్డాయి. అవి విచారణకు వచ్చాక ఈ ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఎంతవరకు సమర్థించుకుంటుందో చూడాలి" అంటూ అశోక్ బాబు పేర్కొన్నారు.

Ashok Babu
MLC
Registrations
Secretariats
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News