USA: అమెరికా నరహంతకుడు ఆత్మహత్య.. డెడ్ బాడీ గుర్తించిన పోలీసులు
- ఊపిరి పీల్చుకుంటున్న లెవిస్టన్ ప్రజలు
- రెండు రోజుల పాటు ఇళ్లల్లోనే ఉండిపోయిన వైనం
- లిస్బన్ ఫాల్స్ సమీపంలో రాబర్ట్ కార్డ్ ఆత్మహత్య!
అమెరికాలోని మైనె రాష్ట్రం లెవిస్టన్ లో కాల్పులు జరిపి 22 మందిని చంపేసిన నరహంతకుడు చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల ఘటనలో రాబర్ట్ కార్డ్ అనే మాజీ ఆర్మీ ఆఫీసర్ ప్రధాన అనుమానితుడని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. తాజాగా లిస్బన్ ఫాల్స్ సమీపంలో రాబర్ట్ మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు. రాబర్ట్ తనను తాను కాల్చుకుని చనిపోయి ఉంటాడని ప్రాథమికంగా తేలిందన్నారు. లెవస్టన్ లోని ఓ బార్ అండ్ రెస్టారెంట్, బౌలింగ్ అలే లో కాల్పులు జరిపి 22 మందిని రాబర్ట్ హత్య చేశాడని పోలీసులు చెప్పారు. ఆపై తన కారులో పారిపోయిన రాబర్ట్ కోసం మైనె పోలీసులు లెవిస్టన్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు రాబర్ట్ బంధువుల ఇంట్లోనూ సోదాలు చేశారు.
హంతకుడు తిరుగుతున్నాడని పోలీసులు హెచ్చరించడంతో మైనె రాష్ట్రంలోని లెవిస్టన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. స్కూళ్లు, ఆఫీసులు, షాపింగ్ మాల్స్ సహా దాదాపుగా అన్నీ మూతపడ్డాయి. రెండు రోజుల పాటు జనం భయాందోళనలతో బయటకు రాలేదు. వీధుల్లో భారీ సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాలతో తనిఖీలు చేశారు. హంతకుడిని పట్టుకోవడానికి ఎఫ్ బీఐ అధికారులు కూడా రంగంలోకి దిగారు. రెండు రోజుల పాటు విస్తృతంగా తనిఖీలు చేసిన పోలీసులు.. లిస్బన్ ఫాల్స్ సమీపంలో రాబర్ట్ కార్డ్ డెడ్ బాడీని గుర్తించారు. ఘటనా స్థలంలో లభించిన ప్రాథమిక ఆధారాలతో రాబర్ట్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని వెల్లడించారు. హంతకుడు చనిపోయాడని పోలీసులు ప్రకటించడంతో లెవిస్టన్, పోర్ట్ లాండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని జనం ఊపిరి పీల్చుకున్నారు.