Raghu Rama Krishna Raju: వచ్చే ఎన్నికల్లో మా వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెనాలి సాధికార సభ నిరూపించింది: రఘురామకృష్ణరాజు
- పదవులన్నీ తన సొంత సామాజికవర్గానికి జగన్ ఇస్తున్నారన్న రఘురాజు
- ఏ ముఖం పెట్టుకుని సామాజిక సాధికార సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్న
- టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించబోతోందని జోస్యం
సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న యాత్రలపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఏ ముఖం పెట్టుకుని సామాజిక యాత్ర చేస్తారని మండిపడ్డారు. తిరుపతిలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ నియమించారని... మొత్తం పదవులను ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని... ఇంత చేసి ఏ ముఖం పెట్టుకుని సామాజిక సాధికార సభలు నిర్వహిస్తారని దుయ్యబట్టారు. త్వరలోనే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అజయ్ రెడ్డిని, మరో కార్పొరేషన్ కు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని నియమించబోతున్నట్టు సమాచారం ఉందని అన్నారు.
జగన్ తన సొంత సామాజికవర్గానికే పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. సామాజిక సాధికార యాత్రలకు ప్రజల మద్దతు లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెనాలిలో జరిగిన సామాజిక సాధికార సభ నిరూపించిందని తెలిపారు. అక్కడి సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని రఘురాజు అన్నారు. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరితే వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని చెప్పారు.