Bithiri Sathi: కేసీఆర్‌ను మించిన మెగా హీరో ఎవరున్నారు?: బీఆర్ఎస్‌లో చేరిన బిత్తిరి సత్తి

Bithiri Sathi Join to BRS Party

  • మొన్ననే గట్టిగా మాట్లాడానని అనుకుంటారేమో... కానీ అమ్ముడు పోవడం కాదన్న బిత్తిరి సత్తి
  • కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్న బిత్తిరి సత్తి
  • బిత్తిరి సత్తికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన హరీశ్ రావు

బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ముదిరాజ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ రోజు బిత్తిరి సత్తితో పాటు టీపీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖరరెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష తదితరులు అధికార పార్టీలో చేరారు. మంత్రి హరీశ్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి మాట్లాడుతూ... రైతుబంధు పేరుతో నేరుగా అకౌంట్లలో పడుతుంటే, వృద్ధులకు ఆసరా పెన్షన్ వస్తుంటే ఇంకా బీఆర్ఎస్‌కు ఓటు ఎవరు వేయకుండా ఉంటారన్నారు. ప్రస్తుతం కొడుకు చెప్పినా తల్లిదండ్రులు వినే పరిస్థితి లేదన్నారు.

 పెద్ద పెద్ద హీరోలను కలుస్తావ్... నీకెందుకయ్యా ఈ రాజకీయం, ఈ రాజకీయ నాయకులతో అని తనకు కొంతమంది చెప్పారని, కానీ కేసీఆర్‌ను మించిన మెగా హీరో ఎవరైనా ఉన్నారా? అన్నారు. అందుకే కేసీఆర్‌తో జత కలిశామన్నారు. మనం ఆయన వెంట ఉండాలని, ఆయనను గెలిపించుకొని మురిసిపోవాలన్నారు. నిన్ననో.. మొన్ననో తాను గట్టిగా మాట్లాడానని (ముదిరాజ్ సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా) అనుకుంటారేమోనని, కానీ తాను అమ్ముడు పోవడం లేదా కొమ్ముకాయడం చేయడం లేదన్నారు.

తెలంగాణ కోసం కేసీఆర్ మొన్న ఓ మాట అన్నారని, తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు ముదిరాజ్ తల్లి పాలు తాగానని చెప్పారని గుర్తు చేశారు. ఈ రోజు మనకు కొట్లాడేవాడు కావాలన్నారు. ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి, చావునోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకు వచ్చారన్నారు. బిత్తిరి సత్తి మీద దాడి చేస్తే సీఎం ఆఫీస్ స్పందించిందన్నారు. మనం నీళ్లిచ్చిన కేసీఆర్ వెంట ఉండాలని, ఆయన హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయమన్నారు. హరీశ్ రావు వంటి బాహుబలిలు ఉండగా ఢోకా లేదన్నారు.

Bithiri Sathi
Harish Rao
BRS
Telangana Assembly Election
  • Loading...

More Telugu News