Chandrababu: చంద్రబాబు తాజా లేఖపై అంశాల వారీగా వివరణ ఇచ్చిన జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్

Jails DIG Ravi Kiran press meet on Chandrababu letter to ACB Court Judge

  • తన ప్రాణాలకు ముప్పు ఉందన్న చంద్రబాబు
  • ఏసీబీ కోర్టు జడ్జికి లేఖ
  • రాజమండ్రి జైలు వద్ద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన డీఐజీ రవికిరణ్

జైల్లో తనను అంతమొందించేందుకు కుట్ర జరుగుతోందని, తన ప్రాణాలకు హాని ఉందనేందుకు అనేక సూచనలు కనిపిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాయడం తెలిసిందే. 

చంద్రబాబు లేఖ నేపథ్యంలో జైళ్లశాఖ డీఐజీ రవికిరణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు లేఖలో పేర్కొన్న అంశాలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మావోయిస్టు పార్టీ నుంచి హెచ్చరిక లేఖ వచ్చినట్టు పోలీసులు తమకు సమాచారం అందించారని వెల్లడించారు. దాంతో ఎస్పీ జైలుకు వచ్చి భద్రతా ఏర్పాట్లను స్వయంగా సమీక్షించారని తెలిపారు. 

ఎస్పీతో కలిసి తాను చంద్రబాబు భద్రతపై వెరిఫికేషన్ చేపట్టినట్టు డీఐజీ రవికిరణ్ వివరించారు. అంతేకాకుండా, చంద్రబాబుకు భద్రత కూడా పెంచామని వెల్లడించారు. అయితే, తమకున్న సమాచారం మేరకు ఆ లేఖ నకిలీ లేఖ అని తేలిందని స్పష్టం చేశారు. చంద్రబాబు సర్ జైలుకు వచ్చినప్పటి నుంచి తాను, ఎస్పీ ప్రతివారం జైలుకు వచ్చి భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నామని డీఐజీ తెలిపారు. తద్వారా చంద్రబాబు సర్ కు జైలు లోపల ఎలాంటి భద్రతా పరమైన లోపాలు లేవని మీడియా ద్వారా తెలియజేస్తున్నామని వివరించారు. 

చంద్రబాబు తన లేఖలోని రెండో అంశాన్ని ఓ ఖైదీ పెన్ కెమెరాతో వచ్చినట్టుగా పేర్కొన్నారని డీఐజీ రవికిరణ్ వెల్లడించారు. శ్రీనివాస చక్రవర్తి అనే వ్యక్తి దొంగతనం కేసులో జైలుకు వచ్చాడని తెలిపారు. జైలుకు ఏ ఖైదీ వచ్చినా, జైలు నుంచి ఎవరు బయటకు వెళుతున్నా, వారికి సంబంధించిన వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే అనుమతిస్తామని స్పష్టం చేశారు. 

ఈ శ్రీనివాస చక్రవర్తి అనే ఖైదీ జైలుకు వచ్చినప్పుడు కూడా పూర్తిగా తనిఖీ చేశామని, అతడు తెచ్చుకున్న చొక్కాల్లో ఒకదానికి బటన్ కెమెరా ఉన్నట్టు తమ సిబ్బంది గుర్తించారని డీఐజీ వెల్లడించారు. అది పెన్ కెమెరా కాదని చెప్పారు. ఆ బటన్ కెమెరాను స్వాధీనం చేసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. అప్పటికి రాత్రి బాగా పొద్దుపోయిందని, అయినప్పటికీ ఎస్పీ స్వయంగా జైలుకు వచ్చి విచారణ చేశారని వివరించారు. ఆ బటన్ కెమెరాను అతడు అమెజాన్ లో ఆర్నెల్ల కిందట కొన్నట్టు గుర్తించామని, అతడు ఆ కెమెరాను జైల్లోకి తీసుకెళ్లలేదని, జైలుకు సంబంధించిన ఎలాంటి ఫుటేజిని ఆ కెమెరాలో చిత్రీకరించలేదని స్పష్టం చేశారు.

ఇక, డ్రోన్ అంశం గురించి చెబుతూ, జైలు చుట్టూ ఇప్పుడు 5 వాచ్ టవర్లు ఉన్నాయని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసిన మీదట జైలు వాచ్ టవర్ల కోసం అదనపు సిబ్బందిని సెంట్రల్ పోలీస్ లైన్ నుంచి కేటాయించారని తెలిపారు. తద్వారా జైలు వాచ్ టవర్ల వద్ద విధి నిర్వహణ మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 23వ తేదీన డ్రోన్ వంటి వస్తువు ఒకదాన్ని గుర్తించినట్టు వాచ్ టవర్ లోని ఒక గార్డు సమాచారం అందించాడని చెప్పారు. దీనిపై పోలీసులకు అధికారికంగా లిఖితపూర్వకంగా సమాచారం అందించామని, చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారని వివరించారు. అంతేకాకుండా, పోలీసులు అదనపు భద్రత ఏర్పాటు చేశారని, ఆ ఘటన తర్వాత మరోసారి డ్రోన్ కనిపించలేదని తెలిపారు. 

గంజాయి పొట్లాలు జైల్లోకి విసిరివేశారని కూడా చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారని, కానీ, ఇప్పటివరకు జైల్లోకి గంజాయి ప్యాకెట్లు విసిరివేయడం జరగలేదని డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు. ఓపెన్ జైల్లో కూడా గంజాయి ప్యాకెట్లు విసిరివేయలేదని చెప్పారు. సెంట్రల్ పోలీస్ లైన్ సిబ్బందితో పాటు, తాము కూడా జైలు చుట్టూ ప్రతి గంటకు ఓసారి రౌండ్ వేసేలా భద్రతా సిబ్బందిని నియమించామని తెలిపారు. 

చంద్రబాబు కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఓ డ్రోన్ ఫొటో తీసిందన్న ఆరోపణలు ఉన్నాయని, కానీ ఆ డ్రోన్ కు సంబంధించి తమకేమీ సమాచారం లేదని అన్నారు. ఇక చంద్రబాబు సర్ లేఖలోని మిగతా అంశాలన్నీ ఆయన బయట ఉన్నప్పుడు ఎదుర్కొన్న అంశాలని, తమ జైలుకు సంబంధించిన విషయాలపై వివరణ ఇచ్చామని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ స్పష్టం చేశారు.

More Telugu News