Amit Shah: మేం అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం: సూర్యాపేట సభలో అమిత్ షా కీలక ప్రకటన

Amit Shah promises bc chief minister

  • సూర్యాపేట బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్న అమిత్ షా
  • కేసీఆర్ ఇప్పటికైనా దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పగలడా? అని ప్రశ్న
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలని విమర్శ
  • అయోధ్య రామమందిరాన్ని పూర్తి చేసుకుందామన్న అమిత్ షా

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తాము అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తామని కేసీఆర్ గతంలో హామీఇచ్చి దానిని నెరవేర్చలేదన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పి మాట తప్పారన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా దళితుడిని సీఎంగా చేస్తారా? అని సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు కుటుంబ పార్టీలు అని విమర్శించారు.

సీఎం కేసీఆర్ తన కొడుకు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని, సోనియా గాంధీ తన తనయుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు కుటుంబాల కోసం చేసేవే అన్నారు. కుటుంబ పార్టీలు తెలంగాణను ఎప్పటికీ అభివృద్ధి చేయవన్నారు. బీఆర్ఎస్ దళిత, పేదల, బీసీల వ్యతిరేక పార్టీ అని దుయ్యబట్టారు. తాము సమ్మక్క సారక్క పేరుతో ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, పసుపు బోర్డు ఇచ్చామని గుర్తు చేశారు. స్వాతంత్రం సిద్దించాక తొలిసారి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలకు ప్రధాని మోదీ న్యాయం చేశారన్నారు.

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామా? అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తి చేద్దామా? నరేంద్రమోదీని మరోసారి ప్రధానిని చేద్దామా? అని అమిత్ షా సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. దానికి సభకు వచ్చిన వారంతా చేద్దామంటూ సానుకూలంగా స్పందించారు.

Amit Shah
G. Kishan Reddy
BJP
Telangana Assembly Election
  • Loading...

More Telugu News