Atchannaidu: ఆ 13 మంది మృతికి జగనే కారణం: అచ్చెన్నాయుడు
- కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
- ఆగి ఉన్న ట్యాంకర్ ను సుమో ఢీకొని 13 మంది మృతి
- మృతులంతా అనంతపురం జిల్లాకు చెందిన వలస కూలీలు
- దసరా పండుగకు వచ్చి కర్ణాటకకు తిరిగి వెళుతుండగా ఘటన
- రాష్ట్రంలో ఉపాధి లభించి ఉంటే వారు చనిపోయి ఉండేవారు కాదన్న అచ్చెన్న
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన 13 మంది వలస కూలీలు దుర్మరణం పాలవడం తెలిసిందే. మృతులంతా అనంతపురం జిల్లాకు చెందినవారు. దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చి, టాటా సుమోలో తిరిగి కర్ణాటక వెళుతుండగా దుర్ఘటన జరిగింది. ఆగివున్న ఓ ట్యాంకర్ ను సుమో వాహనం ఢీకొట్టింది.
ఈ నేపథ్యంలో, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. ఆ 13 మంది వలస కూలీల మృతికి జగనే కారణమని ధ్వజమెత్తారు. ఏపీలో కరవు పరిస్థితులు ఏర్పడడం వల్లే ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారని అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలోనే ఉపాధి లభించి ఉంటే వారు మరణించి ఉండేవారు కాదని అభిప్రాయపడ్డారు.
సైకో సీఎం కరవు నివారణ చర్యలు చేపట్టకపోవడమే ఆ 13 మంది అనంతపురం జిల్లా వాసుల పాలిట మృత్యుశాసనం రాసిందని పేర్కొన్నారు. సాగునీటి కొరతతో పంటలు ఎండిపోతున్నా ఈ సీఎం రైతుల పట్ల కనికరం చూపడంలేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.
రాష్ట్రంలో కరవు ఆందోళనకర స్థితిలో ఉన్నప్పటికీ జగన్ గానీ, వ్యవసాయ, నీటి పారుదల శాఖ మంత్రులు కానీ స్పందించడంలేదని మండిపడ్డారు. రాయలసీమ, పల్నాడు, కృష్ణా డెల్టా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో తీవ్ర క్షామం నెలకొని ఉందని తెలిపారు.