Komatireddy Raj Gopal Reddy: బీజేపీలోకి వెళ్లినా, కాంగ్రెస్‌లో చేరినా కేసీఆర్‌ను గద్దె దింపేందుకే!: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Rajagopal Reddy joins Congress

  • బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లేనాన్న రాజగోపాల్ రెడ్డి  
  • హంగ్ పరిస్థితి ఉంటే బీజేపీ, మజ్లిస్ పార్టీలు బీఆర్ఎస్‌కు మద్దతిస్తాయని వ్యాఖ్య
  • రేవంత్ రెడ్డి సమక్షంలో ఠాక్రే ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరిక

తాను తప్పు చేశానని (పార్టీ మారి), దీనిని సరిదిద్దుకోవడానికే తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓడించడమే తన ఏకైక లక్ష్యమని, అందుకోసమే బీజేపీలోకి వెళ్లిన తాను, తిరిగి కాంగ్రెస్‌లో చేరుతున్నానన్నారు. బీజేపీలోకి వెళ్లినా, కాంగ్రెస్‌లో చేరినా కేసీఆర్‌ను గద్దె దింపేందుకే అన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ చర్యలు తీసుకుంటుందనే ఉద్దేశ్యంతో ఆ పార్టీలో చేరానని, కానీ అలాంటిదేమీ కనిపించకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశానన్నారు. 

బీజేపీలో తనకు సరైన గౌరవం, ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కానీ తన ఆశయం మాత్రం నెరవేరలేదన్నారు. హంగ్ వస్తే బీజేపీ, మజ్లిస్ పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తారని జోస్యం చెప్పారు. బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు ఓటు వేసినట్లే అన్నారు. ప్రజలు తాను కాంగ్రెస్‌లోకి రావాలని కోరుకున్నారని, సర్వేలు తనకే అనుకూలంగా ఉన్నాయన్నారు. కేసీఆర్ ధన మదం, అధికార మదంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు. అవినీతి సొమ్ముతో ప్రధాని కావాలని I.N.D.I.A. కూటమికి నిధులు సమకూరుస్తానని ఆఫర్ ఇచ్చాడని విమర్శించారు.

ఈ రోజు (శుక్రవారం) కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉదయాన్నే ఉందని, ఈ కారణంగా తాను నిన్న రాత్రి మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరానని తెలిపారు. మరోపక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాడంటూ తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఫోటోలను షేర్ చేసింది. రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరిన సమయంలో ఠాక్రేతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క తదితరులు ఉన్నారు.

Komatireddy Raj Gopal Reddy
Congress
Munugode
BJP
Telangana Assembly Election
  • Loading...

More Telugu News