Cricket: నెదర్లాండ్స్‌పై సెంచరీతో సచిన్ రికార్డును సమం చేసిన డేవిడ్ వార్నర్
- వన్డే ప్రపంచ కప్‌లలో అత్యధిక సెంచరీలతో రికార్డ్
- 6 శతకాలతో సరిసమానంగా నిలిచిన వార్నర్
- ఈ జాబితాలో రికీ పాంటింగ్, సంగక్కరలను వెనక్కి నెట్టిన స్టార్ ఓపెనర్
అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో వరుసగా రెండవ సెంచరీ నమోదు చేశాడు. బుధవారం నెదర్లాండ్స్‌పై జరిగిన మ్యాచ్‌లో 104 పరుగులు చేసి శెభాష్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సాధించిన మైలురాయిని డేవిడ్ వార్నర్ సమానం చేశాడు.
వన్డే ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో టెండూల్కర్ తో సమానంగా వార్నర్ నిలిచాడు. వన్డే ఫార్మాట్ వరల్డ్ కప్‌లో వార్నర్‌కి ఇది 6వ సెంచరీ కాగా సచిన్ టెండూల్కర్ కు కూడా 6 సెంచరీలు ఉన్నాయి. దీంతో వీరిద్దరూ సమానంగా నిలిచారు. ఇక అద్భుత సెంచరీతో చెలరేగిన వార్నర్ తన దేశానికే చెందిన రికీ పాంటింగ్, శ్రీలంక గ్రేట్ కుమార సంగక్కరలను ఈ జాబితాలో వెనక్కి నెట్టాడు. ఈ మాజీ కెప్టెన్లు ఇద్దరికీ 5 చొప్పున ప్రపంచకప్ సెంచరీలు ఉన్నాయి.
కాగా చిరస్మరణీయమైన ఈ సెంచరీని డేవిడ్ వార్నర్ ‘పుష్ఫ’ స్టైల్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ‘తగ్గేదేలే’ అంటూ పోజులిచ్చి మైదానంలోని ఫ్యాన్స్‌ని అలరించాడు. కాగా భారతీయ క్రికెట్ ఫ్యాన్స్‌తో ప్రత్యేక బంధాన్ని కలిగివున్న డేవిడ్ వార్నర్ ఈ స్టైల్‌లో అలరించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా మైదానాల్లో పుష్ప పాటలకు డ్యాన్స్ చేసి అందరినీ ఆకర్షించాడు.
వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్లు..
1. రోహిత్ శర్మ- 7
2. సచిన్ టెండూల్కర్ - 6
2. డేవిడ్ వార్నర్ - 6
3. రికీ పాంటింగ్ - 5
3. కుమార్ సంగక్కర - 5.