Rajagopal Reddy: ఎవరిష్టం వారిది.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై కిషన్ రెడ్డి

Kishan Reddy Reaction On Rajagopal Reddy Episode

  • ఆయనకు మంచి అవకాశం ఇచ్చామన్న కేంద్ర మంత్రి
  • జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని వివరణ
  • తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వ్యాఖ్య

బీజేపీ తెలంగాణ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం పార్టీకి రాజీనామా చేశారు. బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు రోజుల్లో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ టికెట్ పై బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఎవరి ఇష్టం వారిది.. ఎవరి ఆలోచనలు వారివని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ మంచి అవకాశం ఇచ్చిందని, జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని కిషన్ రెడ్డి చెప్పారు.

అయినా పార్టీ మారడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని వివరించారు. అయితే, వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాబోదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీకి రాజీనామా చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిని కిషన్ రెడ్డి తప్పుబట్టారు. బీజేపీ పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కాగా, పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, జనసేనతో పొత్తుపై ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

Rajagopal Reddy
komatireddy
Telangana
BJP
Kishan Reddy
Congress
  • Loading...

More Telugu News