: 'చివరి కప్పు' కోసం సూపర్ సమరం
ఎనిమిది టెస్టు హోదా జట్లు తలపడే చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ రేపటి నుంచి ఇంగ్లండ్ లో జరగనుంది. 1998 నుంచి రెండేళ్ళకోమారు జరుగుతున్న ఈ టోర్నీ క్రమేణా ప్రజాదరణ కోల్పోయిన దరిమిలా, ఈ భారీ ఈవెంట్ కు స్వస్తి చెప్పాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇదే చివరి చాంపియన్స్ ట్రోఫీ కానుంది. కాగా, తన ఖాతాలో వన్డే ప్రపంచకప్ తో పాటు టి20 వరల్డ్ కప్ లను చేర్చుకున్న భారత్ జట్టును చాంపియన్స్ ట్రోఫీ ఊరిస్తోంది.
ఇప్పటి వరకు ఒక్క పర్యాయం కూడా టీమిండియా ఈ టోర్నీ టైటిల్ ను సాధించలేకపోయింది. ఆఖరి టోర్నీలోనైనా ఈ ఘనతను స్వంతం చేసుకోవాలని ఈ వన్డే వరల్డ్ చాంపియన్ టీమ్ భావిస్తోంది. రేపటి నుంచి ఈ మినీ వరల్డ్ కప్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రెండు జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఇదే గ్రూప్ లో పాకిస్తాన్, వెస్టిండీస్ జట్లున్నాయి. ఇక గ్రూప్-ఏలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక ఉన్నాయి.
టోర్నీ ఎలా సాగుతుందంటే.. లీగ్ దశలో ఒక్కో జట్టు తన గ్రూప్ లోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్ దశ పోరాటం ముగిసిన అనంతరం తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్ కు చేరతాయి. గ్రూప్-ఏలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు గ్రూప్-బిలో రెండోస్థానం దక్కించుకున్న జట్టుతో సెమీఫైనల్ ఆడుతుంది. ఇక గ్రూప్-ఏలో రెండోస్థానంలో నిలిచిన జట్టుతో గ్రూప్-బి టాపర్ సెమీస్ లో తలపడుతుంది. ఈ రెండు సెమీస్ సమరాల్లో నెగ్గిన జట్లు జూన్ 23న బర్మింగ్ హామ్ లో జరిగే ఫైనల్ లో అమీతుమీ తేల్చుకుంటాయి. కాగా, విజేతలకు రూ.11.3 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ. 5.6 కోట్లు ప్రైజ్ మనీగా ఇవ్వనున్నారు.