Andhra Pradesh: రక్తసిక్తమైన దేవరగట్టు.. ప్రమాదవశాత్తూ యువకుడి మృతి

Bloodied Devaragattu in Banni Ustav and a young man dead accidentaly

  • కోలాహలంగా బన్నీ ఉత్సవం.. పలువురికి గాయాలు
  • మాళ మల్లేశ్వర స్వామి విగ్రహాల కోసం కర్రల సమరం
  • ప్రమాదవశాత్తూ చెట్టు మీద నుంచి పడి యువకుడి మృతి

ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరిగింది. మాళ మల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు కర్రల సమరం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా రెండు గ్రూపులు రింగులు తొడిగిన కర్రలతో కొట్టుకోవడంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి. కొందరి తలలు పగిలాయి. నెరణికి, నెరణికితండా, కొత్తపేట, సులువాయి, ఆలూరు, బిలేహాలు, విరుపాపురంత గ్రామాలవారు ఇందులో పాల్గొన్నారు. కాగా ఈ ఉత్సవానికి అనుమతి తీసుకోవడంతో పోలీసు యంత్రాంగం సీసీ కెమెరాల ద్వారా ఈ కర్రల సమరాన్ని పరిశీలించింది. 

చెట్టు పైనుంచి పడి యువకుడి మృతి..

దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో ఈ ఏడాది అపశ్రుతి జరిగింది. ఉత్సవాన్ని వీక్షిస్తున్న సమయంలో సింహాసనం కట్ట వద్ద ఉన్న వేప చెట్టుపైకి భక్తులు ఎక్కారు. ఎక్కువ మంది ఎక్కడంతో చెట్టు కొమ్మ విరిగిపోయింది. దీంతో చెట్టు మీద నుంచి  పలువురు భక్తులు కిందపడ్డారు. ఈ ప్రమాదంలో ఆలూరుకు చెందిన గణేష్ అనే ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించినప్పటికీ గాయం తీవ్రత కారణంగా చనిపోయాడు. ఈ ప్రమాదంలో మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్స అందించారు. 

కాగా కర్రలు లేకుండా ఉత్సవం జరిపించాలని ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కలెక్టరు, ఎస్పీ ప్రయత్నించారు. వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రయోజనం లేకపోయింది. విజయదశమి పర్వదినాన ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం దేవరగట్టుకు భక్తులు చేరుకున్నారు. దాదాపు అరగంటపాటు బన్నీ ఉత్సవం కొనసాగింది.

  • Loading...

More Telugu News