Afghanistan: పాకిస్థాన్ కు దిమ్మదిరిగింది... ఆఫ్ఘనిస్థాన్ సంచలన విజయం

Afghanistan sensational victory against Pakistan

  • వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ జోరు
  • మొన్న ఇంగ్లండ్ ను ఓడించి, ఇవాళ పాక్ ను చిత్తు చేసిన ఆఫ్ఘన్
  • చెన్నైలో ఆఫ్ఘనిస్థాన్ ఆల్ రౌండ్ షో
  • 283 పరుగుల లక్ష్యాన్ని 49 ఓవర్లలో ఛేదించిన వైనం
  • అద్భుతంగా ఆడిన ఆఫ్ఘన్ టాపార్డర్

భారత గడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్థాన్ జట్టు మరో సంచలన విజయం నమోదు చేసుకుంది. మొన్న ఇంగ్లండ్ ను ఓడించడం ఆషామాషీగా జరిగింది కాదంటూ, ఇవాళ పాకిస్థాన్ పై సాధికారికంగా నెగ్గి ఔరా అనిపించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు 8 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాక్ మొదట 50 ఓవర్లలో 7 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ 49 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి విజయలక్ష్యాన్ని అందుకుంది. 283 పరుగుల ఛేజింగ్ లో ఆఫ్ఘన్ టాపార్డర్ అదరగొట్టింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జాద్రాన్ తొలి వికెట్ కు 130 పరుగులు జోడించి సరైన పునాది వేయగా... రహ్మత్ షా, కెప్టెన్ హష్మతుల్లా షాహిది మిగతా పని పూర్తి చేశారు. 

రహ్మనుల్లా గుర్బాజ్ 53 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్ తో 65 పరుగులు చేయగా, మరో ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ 113 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. అతడి స్కోరులో 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ అవుటైన తర్వాత రహ్మత్ షా, హష్మతుల్లా షాహిది మరో వికెట్ పడకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.

రహ్మత్ షా 84 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేయగా, షాహిది 45 బంతుల్లో 48 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది 1, హసన్ అలీ 1 వికెట్ తీశారు. 

కాగా, వన్డే క్రికెట్లో పాకిస్థాన్ పై ఆఫ్ఘనిస్థాన్ కు ఇదే మొదటి గెలుపు. అంతేకాదు, వన్డేల్లో ఆఫ్ఘన్లకు ఇదే అత్యధిక లక్ష్యఛేదన. ఇవాళ్టి మ్యాచ్ లో 18 ఏళ్ల ఆఫ్ఘన్ కుర్ర స్పిన్నర్ నూర్ మహ్మద్ ప్రదర్శన మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి.

More Telugu News