bill clinton: పాకిస్థాన్ చేరిన వెంటనే నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు
- అణు పరీక్షలు నిర్వహించొద్దంటూ అమెరికా ఆఫర్ ఇచ్చినట్టు ప్రకటన
- 5 బిలియన్ డాలర్లు సాయం చేస్తామన్నా తిరస్కరించినట్టు వెల్లడి
- 1998 భారత్ అణు పరీక్షలకు తగిన బదులిచ్చామన్న షరీఫ్
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీప్ స్వదేశానికి చేరుకున్న వెంటనే సంచలన వ్యాఖ్యలతో ప్రజలను, మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేశారు. తన పాలనలో సాధించిన విజయాలను ప్రజలకు గుర్తు చేశారు. 1998 భారత్ అణు పరీక్షల నిర్వహణకు తాను తగిన బదులిచ్చినట్లు నవాజ్ షరీఫ్ చెప్పారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ అణు పరీక్షలు జరపొద్దని, అలా చేస్తే 5 బిలియన్ డాలర్లు సాయంగా అందిస్తామని ఆఫర్ చేసినా.. తాను క్షిపణీ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపించినట్టు తెలిపారు.
పాకిస్థాన్ బయట నాలుగేళ్ల పాటు యూకేలో తలదాచుకున్న పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ అధినేత నవాజ్ షరీఫ్ (73) తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. దుబాయి నుంచి ప్రత్యేక విమానంలో ఇస్లామాబాద్ కు వచ్చారు. జనవరిలో ఎన్నికలకు ముందు నవాజ్ షరీఫ్ ప్రణాళిక మేరకు స్వదేశానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్థాన్ ముస్లింలీగ్ కు మంచి పట్టున్న లాహోర్ చేరుకుని బహిరంగ ర్యాలీలో మాట్లాడారు.
‘‘కొన్నేళ్ల తర్వాత నేను మిమ్మల్ని కలుసుకుంటున్నాను. కానీ నా ప్రేమ ఎప్పుడూ అలానే ఉంటుంది. ఈ బంధంలో ఎలాంటి తేడా లేదు’’అని షరీఫ్ చెప్పారు. 1998లో భారత్ అణు పరీక్షలకు పాకిస్థాన్ స్పందించాలని అనుకుంటున్న సమయంలోనే విదేశీ ప్రభుత్వాల నుంచి ఒత్తిడి వచ్చినట్టు షరీఫ్ చెప్పారు. ‘‘క్లింటన్ 5 బిలియన్ డాలర్లు ఇస్తామన్నారు. ఇది 1999లో జరిగింది. నాకు కూడా బిలియన్ డాలర్లు ఇస్తామన్నారు. కానీ, నేను పాకిస్థాన్ నేలలో పుట్టాను. అందుకే పాకిస్థాన్ ప్రయోజనాలకు వ్యతిరేకమైనదాన్ని అంగీకరించలేదు. అటామిక్ టెస్ట్ నిర్వహించి భారత్ కు సరైన సమాధానం ఇచ్చాం’’అని షరీఫ్ పేర్కొన్నారు.