Google: గూగుల్ ను కోర్టుకు ఈడ్చి గెలిచిన మహిళా ఉద్యోగి
- పని ప్రదేశంలో వివక్షను సవాలు చేసిన ఉద్యోగిని
- జూనియర్లకు తనకంటే ఎక్కువ వేతనాలు ఇచ్చినట్టు ఆరోపణ
- పని ప్రదేశాల్లో వివక్ష, ప్రతీకారానికి తావు లేదన్న జ్యూరీ
గూగుల్ ఓ మహిళా ఉద్యోగి పట్ల వివక్ష ప్రదర్శించింది. ఫలితంగా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. మహిళా ఉద్యోగికి 1.1 మిలియన్ డాలర్లు పరిహారంగా చెల్లించాలని (సుమారు రూ.9 కోట్లు) అక్కడి కోర్టు ఆదేశించింది. గూగుల్ క్లౌడ్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఉల్కురోవే కోర్టును ఆశ్రయించారు. తన కంటే జూనియర్, తక్కువ అనుభవం ఉన్న పురుష ఉద్యోగులను తనకు సమానమైన బాధ్యతల్లోకి తీసుకుని, వారికి అధిక వేతనాలు చెల్లిస్తున్నారంటూ ఆమె కోర్టుకెక్కారు. తాను ఫిర్యాదు చేసినందుకు తనకు ప్రమోషన్లను కూడా గూగుల్ తిరస్కరించినట్టు ఆరోపించారు.
ఆమె ఎదుర్కొన్న నష్టానికి, ఎదుర్కొన్న బాధకు గాను పరిహారం చెల్లించాలంటూ న్యూయార్క్ జ్యూరీ గూగుల్ ను ఆదేశించింది. గూగుల్ పై ఉల్కురోవే చేసిన ఆరోపణలు నిజమేనని కోర్టు పేర్కొంది. వివక్ష, ప్రతీకారం అనేవి పని ప్రదేశాల్లో అనుమతించేది లేదని తెలిపింది. గూగుల్ లింగ వివక్షకు పాల్పడినట్టు జ్యూరీ భావించింది. దీంతో పరిహారం చెల్లింపునకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది.