Gaddar Daughter: ఎన్నికల్లో పోటీపై గద్దర్ కూతురు వెన్నెల క్లారిటీ
- కంటోన్మెంట్ నుంచి ఎన్నికల్లో పోటీకి దిగేందుకు రెడీ అన్న వెన్నెల
- కాంగ్రెస్ అవకాశం ఇస్తే ప్రజలు ఆదరిస్తారని వ్యాఖ్య
- తన తండ్రి గద్దర్ చివరి వరకూ కాంగ్రెస్‌కు సపోర్టు చేసినట్టు వెల్లడి
ప్రజాయుద్ధ నౌక గద్దర్ కుమార్తె వెన్నెల తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దిగే విషయమై సర్వత్రా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆమే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పిన వెన్నెల, కాంగ్రెస్ అవకాశం ఇస్తే కచ్చితంగా గెలుస్తానని చెప్పారు. తాను కంటోన్మెంట్‌లోనే పుట్టిపెరిగానని, ఇక్కడి ప్రజలు తనను ఆదరిస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. గద్దర్ కూతురిగా ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమని పేర్కొన్నారు. ఓటు విప్లవం రావాలని కోరుకున్న గద్దర్ చివరి వరకూ కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన విషయాన్ని వెన్నెల గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేద్దామని కూడా గద్దర్ భావించినట్టు పేర్కొన్నారు. తండ్రి కోరిక మేరకు తాను ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
తమ కూతురి గెలుపు కోసం కృషి చేస్తానని గద్దర్ భార్య విమల కూడా పేర్కొన్నారు. కంటోన్మెంట్ ప్రజలు భారీ మెజార్టీతో వెన్నెలను గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు, కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత సాయన్న కూతురు లాస్య నందిత బీఆర్ఎస్ తరుపున కంటోన్మెంట్ స్థానానికి పోటీపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో బీఆర్ఎస్ ఆయన కూతురికి ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించింది. సీఎం కేసీఆర్ స్వయంగా లాస్యకు ధైర్యం చెప్పి ఆశీర్వదించారు. తండ్రికి ప్రజల్లో ఉన్న పాప్యులారిటీ, సానుభూతి తనకు కలిసి వస్తాయని లాస్య అంచనా వేస్తున్నారు.