- టికెట్ కోసం విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు
- రేసులో యూత్ కాంగ్రెస్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్
- అజారుద్దీన్ పై క్రిమినల్ కేసుతో టికెట్ పై అయోమయం
టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ మహమ్మద్ అజారుద్దీన్ ఈ విడత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఉత్సాహం చూపిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం కోసం ఆయన తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్ఠానంతో తనకున్న పరిచయాలను ఇందుకు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసే వారిలో అజారుద్దీనే ముందంజలో ఉన్నారు.
అయితే, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు చెందిన రూ.3.8 కోట్లు దుర్వినియోగం చేసినట్టు ఆయనపై తాజాగా క్రిమినల్ కేసు నమోదు కావడంతో సమస్య వచ్చి పడింది. ఇది అజారుద్దీన్ కు ప్రతికూలంగా మారేట్టు కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ స్థానం పీజేఆర్ కు ఒకప్పుడు కంచుకోటగా ఉండేది. ఆయన మరణానంతరం ఆయన కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి 2009 ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి గెలవడం తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసినప్పటికీ, మాగంటి గోపీనాథ్ చేతిలో ఆయన ఓడిపోయారు.
అజారుద్దీన్ పై కేసు నమోదు తర్వాత ఒకవైపు విష్ణువర్థన్ రెడ్డి, మరోవైపు యూత్ కాంగ్రెస్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ అమీర్ జావీద్ జూబ్లీ హిల్స్ టికెట్ కోసం ఢిల్లీకి వెళ్లి తమవంతు ప్రయత్నాలు సాగిస్తున్నట్టు తెలిసింది. విష్ణువర్ధన్ రెడ్డి సోదరి విజయారెడ్డి సైతం ఖైరతాబాద్ కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. విజయ, విష్ణువర్ధన్ రెడ్డిలో ఒకరికే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.