world cup: బెంగళూరు స్టేడియంలో భారత్ మాతా కీ జై అంటూ ఆస్ట్రేలియా పౌరుడి నినాదం.. వీడియో ఇదిగో!
- ఆస్ట్రేలియా వర్సెస్ పాక్ మ్యాచ్ లో నినాదాలు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు
వరల్డ్ కప్ టోర్నమెంట్ లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శుక్రవారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ పౌరుడు ఒకరు తమ జట్టుకు మద్దతుగా పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిపై సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్న పోలీసులతో సదరు పౌరుడు గొడవ పడిన వీడియో వైరల్ గా మారింది. అయితే, అదే స్టేడియంలో జరిగిన మరో ఘటన ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో ఆస్ట్రేలియా పౌరుడు ఒకరు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు చేయడం కనిపిస్తోంది.
చుట్టూ ఉన్న ప్రేక్షకులు ఆయనతో గొంతు కలిపి నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ భారత అభిమానుల హృదయాలను గెల్చుకున్నావంటూ ఆస్ట్రేలియా అభిమానిపై ప్రశంసిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన మరో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా పౌరుడు ఒకరు గణపతి బప్పా మోరియా అంటూ నినదించడం తెలిసిందే.