Team India: అలా చేసి ఉండాల్సింది కాదు.. టీం ఫస్ట్ కదా.. కోహ్లీ శతకంపై పుజారా అసంతృప్తి

Cheteshwar Pujara On Virat Kohli Slowing Down To Reach 100

  • బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ
  • ఆటగాళ్ల వ్యక్తిగత ప్రయోజనాలకంటే జట్టే ముఖ్యమన్న పుజారా
  • నెట్ రన్‌రేట్ ముఖ్యమన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని ఉండాల్సిందన్న వెటరన్ బ్యాటర్
  • వ్యక్తిగత మైలురాళ్ల కోసం జట్టు బలికాకూడదని వ్యాఖ్య
  • కోహ్లీ సెంచరీని సమర్థించిన ఆసీస్ లెజెండ్

ఇండియన్ బ్యాటింగ్ లెజెండ్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌పై చేసిన శతకంపై క్రికెట్ నిపుణుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సెంచరీ కోసం జట్టు ప్రయోజనాలను కాదని నెమ్మదిగా ఆడాడని కొందరంటే.. మరికొందరు మాత్రం ప్రశంసిస్తున్నారు. తాజాగా, ఈ జాబితాలో వెటరన్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా చేరాడు. 

‘ఈఎస్‌పీఎన్ క్రిక్‌ ఇన్ఫో’తో పుజారా మాట్లాడుతూ.. ‘‘కోహ్లీ సెంచరీ చేయాలని కోరుకున్న వారిలో నేనూ ఒకడిని. అయితే, ఇక్కడ గేమ్‌ను ఎంత త్వరగా ముగించాం అన్నది ముఖ్యం. ఎందుకంటే, జట్టు అగ్రస్థానానికి చేరుకోవాలంటే నెట్‌రన్‌రేట్ చాలా ముఖ్యం. ఇది మనసులో పెట్టుకోవాలి. నువ్వా స్థానంలో ఉన్నప్పుడు నెట్ రన్‌రేట్ గురించే పోరాడాలి. అప్పుడిక వెనక్కి తిరిగి చూసుకునే పనే ఉండదు’’ అని చెప్పుకొచ్చాడు. 

కోహ్లీ అయినా, ఇతర ఆటగాళ్లు అయినా జట్టుకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నాడు. వ్యక్తిగత మైలు రాళ్లకు జట్టు బలికాకూడదని అన్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే తర్వాతి మ్యాచ్‌కు ఇక తమకు ఢోకా ఉండదని ఆటగాళ్లు భావిస్తున్నారని విమర్శించాడు. ఈ ఆలోచనా ధోరణి మారాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. 

ఆస్ట్రేలియా లెజెండ్ మ్యాథ్యూ హెడెన్ కూడా కోహ్లీ సెంచరీపై స్పందించాడు. సెంచరీ సాధించే హక్కును కోహ్లీ సంపాదించాడని, అయితే, ఇలాంటి టోర్నీలలో చాలా జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఇలాంటివి ముఖ్యమైన విషయాలుగా మారుతాయని ఇయాన్ బిషప్ ఎప్పుడూ చెబుతుంటారని గుర్తుచేసుకున్నాడు. అయితే, క్రీజులో ఉన్న వారిద్దరూ తీసుకున్న నిర్ణయంతో తనకు ఎలాంటి సమస్యా లేదంటూ కోహ్లీ సెంచరీని సమర్థించాడు.

Team India
Bangladesh
Virat Kohli Century
Cheteshwar Pujara
Matthew Hayden
  • Loading...

More Telugu News