COVID19: డెంగీ ఉద్ధృతికి కరోనా యాంటీబాడీలు కారణమా?
- అవునంటున్న పరిశోధకులు
- దీనిపై అధ్యయనం నిర్వహించిన కేంద్ర ప్రభుత్వ సంస్థ
- కరోనా యాంటీబాడీలు డెంగీ వైరస్ ను ప్రభావితం చేయగలవని గుర్తింపు
ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా డెంగీ కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోనూ ఈ సీజన్ లో ఇప్పటికే వేలాది కేసులు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో నమోదయ్యాయి. మంచి నీరు నిల్వ ఉన్న చోటు డెంగీకి కారణమయ్యే ఏడిస్ ఈజిప్టై దోమల సంతతి పెరుగుతుంది. అందుకే ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఎక్కడా కూడా నీరు నిల్వ లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దోమలు రాకుండా విండో నెట్, డోర్ నెట్, బెడ్ నెట్ వాడుకోవడం ద్వారా రక్షణ కల్పించుకోవచ్చు.
అయితే ఈ సీజన్ లో డెంగీ జ్వరాల తీవ్రత ఉంది. వచ్చిన వారికి వెంటనే తగ్గట్లేదు. రోజుల తరబడి బాధపడాల్సి వస్తోంది. దీనికి కరోనా కారణంగా మన శరీరంలో తయారైన యాంటీ బాడీల స్పందనే కారణమని నిపుణులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వ బయోటెక్నాలజీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో పనిచేసే ట్రాన్స్ లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇనిస్టిట్యూట్ (టీహెచ్ఎస్ టీఐ) దీనిపై ఒక అధ్యయనం నిర్వహించింది.
యాంటీ సార్స్ కోవ్-2 యాంటీబాడీలు డెంగీ వైరస్ 2తో క్రాస్ రియాక్ట్ అవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. గత కరోనా తాలూకూ యాంటీబాడీలు తాజాగా సోకిన డెంగీ వైరస్ కణాలు భారీగా వృద్ధి చెందేందుకు సాయపడుతున్నట్టు తెలుసుకున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్లలో, కరోనా యాంటీబాడీలతో క్రాస్ రియాక్టింగ్ కు అవకాశాలు ఉన్నాయని ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్స్ పల్మనాలజీ విభాగం వైద్యులు డాక్టర్ హరీష్ చాఫ్లే పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఒక వైరస్ కు స్పందనగా ఉత్పత్తి అయిన యాంటీబాడీలు, మన శరీరంలో మరో వైరస్ ప్రవేశించినప్పుడు శరీర స్పందనను ప్రభావితం చేయగలవని చెప్పారు. డెంగీ ఇన్ఫెక్షన్ తీవ్రతకు కరోనా యాంటీబాడీలే కారణమా? అన్న దానిపై మరింత లోతైన అధ్యయనం అవసరమన్నారు. కనుక రిస్క్ ఉన్న వారు ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు.