Maharashtra: కనిపించకుండా పోయిన గర్భిణి మృతి.. రాత్రంతా తల్లి శవం వద్దే నాలుగేళ్ల కుమారుడు

Missing pregnant woman found dead 4year old son sits beside corpse all night in Maharashtra

  • మహారాష్ట్రంలోని చంద్రాపూర్‌లో ఘటన
  • ఐస్‌క్రీం కోసం కుమారుడితో కలిసి బయటకు
  • బురదలో కూరుకుపోయి చనిపోయి ఉంటుందని అనుమానం
  • మృతిపై అన్ని కోణాల్లోనూ విచారణ

ఐస్‌క్రీం కోసం నాలుగేళ్ల కుమారుడితో వెళ్లి కనిపించకుండా పోయిన గర్భిణి విగతజీవిగా మారింది. ఆ చిన్నారి రాత్రంతా తల్లి మృతదేహం పక్కనే ఏడుస్తూ కనిపించిన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని చంద్రాపూర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బల్లార్‌పూర్‌లోని టీచర్స్ కాలనీకి చెందిన సుష్మ కాక్డే బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఐస్‌ క్రీం కొనిపెట్టేందుకు కుమారుడు దుర్వాంశ్‌ని తీసుకుని బయటకు వెళ్లింది.

ఎంతసేపైనా ఆమె ఇంటికి చేరకపోవడంతో బ్యాంక్ ఉద్యోగి అయిన ఆమె భర్త పవన్ కుమార్ కాక్డే, ఇతర కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో బల్లార్‌పూర్ పోలీసులు ఆశ్రయించారు. ఈ క్రమంలో గురువారం ఉదయం వార్ధా నది వంతెన వద్ద సుష్మ మృతదేహాన్ని, పక్కనే ఏడుస్తున్న నాలుగేళ్ల బాబును గుర్తించిన స్థానికులు వెంటనే ఆమె భర్త పవన్‌కుమార్‌కు సమాచారం అందించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున 4 గంటలకు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని బాబును వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బ్రిడ్జి సమీపంలోని బురదలో కూరుకుపోయి ఆమె మరణించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News