Andhra Pradesh: రాష్ట్రం మారలేదు.. బడ్జెట్ మారలేదు.. మారిందల్లా ముఖ్యమంత్రి మాత్రమే: సీఎం జగన్
- ఏపీలో అప్పుడు జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని వెల్లడి
- గతంలో గజదొంగల ముఠా దోచుకునే కార్యక్రమం జరిగిందని విమర్శలు
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సభలో గత ప్రభుత్వంపై జగన్ విసుర్లు
ఆంధ్రప్రదేశ్ విడిపోయాక ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు రాష్ట్రాన్ని పాలించాయని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తేడా గురించి చెబుతూ.. గతానికి ఇప్పటికి రాష్ట్రం మారలేదు, బడ్జెట్ మారలేదని అన్నారు. రాష్ట్రంలో మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమేనని పేర్కొన్నారు. అయినా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరుగుతోందని, అదెలా సాధ్యమైందో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేవలం ముఖ్యమంత్రి మారడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో గురువారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా జగనన్న చేదోడు పథకం నిధులు విడుదల చేశారు.
గతంలో పొదుపు సంఘాల మహిళల సమస్యలు తొలగిపోవాలంటే చంద్రబాబు పాలన రావాలంటూ టీవీల్లో అడ్వర్టైజ్ మెంట్ వచ్చేదని జగన్ గుర్తుచేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా పొదుపు సంఘాల మహిళల కష్టాలు మాత్రం పోలేదని వివరించారు. ఉన్న కష్టాలు తీరకపోగా అప్పటి వరకు వచ్చిన సున్నా వడ్డీ పథకం కూడా చంద్రబాబు ఎత్తేశారని విమర్శించారు. రైతన్నలకూ ఇదే పరిస్థితి ఎదురైందని, పంట రుణాల మాఫీ విషయంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందని, సున్నా వడ్డీ పథకానికి రైతులు దూరమయ్యారని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో గజదొంగల ముఠా ఉండేదని, ప్రజల సొమ్మును దోచుకునే కార్యక్రమం జరిగేదని జగన్ విమర్శించారు.