Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా 36వ రోజూ కొనసాగిన దీక్షలు... ఫొటోలు ఇవిగో!

TDP protests continue for 36th day

  • స్కిల్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో చంద్రబాబు  
  • నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు
  • సైకిల్ ర్యాలీలు చేపట్టిన టీడీపీ శ్రేణులు 

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ టీడీపీ శ్రేణుల నిరసనలు 36వ రోజూ కొనసాగాయి. నియోజకవర్గ కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. 'బాబుతో నేను' కార్యక్రమం ద్వారా ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు ప్రజా వేదికలను నిర్వహించి చంద్రబాబు నాయుడు అరెస్టు తీరును ప్రజలకు వివరించారు. నల్ల రిబ్బన్లతో నిరసనలు తెలియజేశారు. 

హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండల కేంద్రంలో టీడీపీ నాయకులు వీరభద్రస్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల తెలుగుదేశం పార్టీ శ్రేణులు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కళ్ళకు నల్ల రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలియజేశారు. 

కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ దంపతులు జగ్గంపేటలో రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద తొమ్మిది రోజులపాటు నవగ్రహ శాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఏడవ రోజు... పీటలపై గోకవరం మండలం కామరాజుపేట గ్రామానికి చెందిన తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అడపా భరత్ బాబు, కామరాజు పేట ఎంపీటీసీ సభ్యురాలు అడపా సుహాసిని దంపతులు కూర్చోని హోమం నిర్వహించారు. 

మడకశిర ఇంఛార్జ్ గుండుమల తిప్పేస్వామి మారెమ్మ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పామర్రు నియోజకవర్గం మొవ్వ మండల టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు వీర్ల నరేష్ కనకదుర్గమ్మకు 108 కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబు విడుదల కావాలని కోరుకున్నారు. 

పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో మహిళలు నోటికి నల్ల రిబ్బన్లతో మౌనదీక్ష చేపట్టారు. పుట్టపర్తి నియోజకవర్గం బొంతలపల్లి గ్రామంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గ్రామదేవత సత్తెమ్మకు పూజలు నిర్వహించి నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టారు. పోలవరం ఇంఛార్జ్ బొరగం శ్రీనివాసులు, టీడీపీ నాయకులు పోలవరంలోని గోదావరిలో దిగి నిరసన తెలియజేశారు. 

అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవి  11వ రోజు సైకిల్ యాత్ర చేశారు. అద్దంకి మండలం శింగరకొండ ఆలయం నుంచి గోవాడ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఇక, ఒడిశాలోని భువనేశ్వర్ లోనూ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు.

  • Loading...

More Telugu News