Kala Venkata Rao: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది: కళా వెంకట్రావు
- జైల్లో చంద్రబాబును కలిసిన భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి
- జైలు వద్దకు వచ్చిన టీడీపీ సీనియర్ నేతలు
- వీళ్లిచ్చే మందులతో చంద్రబాబుకు ఉపశమనం లేదన్న కళా వెంకట్రావు
స్కిల్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును ఇవాళ కుటుంబ సభ్యులు కలిశారు. నారా భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి రాజమండ్రి జైలులో చంద్రబాబును ములాఖత్ లో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా జైలు వద్దకు టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, కొల్లు రవీంద్ర, చినరాజప్ప తదితరులు కూడా వచ్చారు.
చంద్రబాబుతో కుటుంబ సభ్యుల ములాఖత్ అనంతరం టీడీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. కిమిడి కళా వెంకట్రావు మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వెల్లడించారు. వీళ్లిచ్చే మందులతో ఆయనకు ఏమీ ఉపశమనం లేదని తెలుస్తోందని వివరించారు.
చంద్రబాబుకు చేసే వైద్య పరీక్షల వివరాలను, డాక్టర్ల సిఫారసుల తాలూకు నివేదికకు సంబంధించిన ఓ కాపీని చంద్రబాబు కుటుంబ సభ్యులకు కూడా ఇవ్వాలని తాము నిన్న టీడీపీ ఆఫీసు నుంచి డిమాండ్ చేశామని కళా వెంకట్రావు స్పష్టం చేశారు. దీనిపై నారా భువనేశ్వరమ్మ ఒక లేఖ కూడా రాశారని తెలిపారు.
ఎప్పటికప్పుడు నివేదిక కాపీని ఇవ్వడం వల్ల చంద్రబాబు బ్లడ్ లెవల్స్ ఎలా ఉన్నాయనేది తెలుస్తుందని అన్నారు. చంద్రబాబుకు హైదరాబాదులో, విజయవాడలో వ్యక్తిగత వైద్య బృందాలు ఉన్నాయని, నివేదిక కాపీని వారికి పంపిస్తే చంద్రబాబు వాడే మందుల్లో ఏవైనా మార్పులు చేర్పులు చేయాలేమో సూచిస్తారన్నది చంద్రబాబు కుటుంబ సభ్యుల అభిప్రాయం అని కళా వెంకట్రావు వివరించారు.
"చంద్రబాబు వైద్య నివేదికలు ఎందుకు ఇవ్వడంలేదు? ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? జగన్ రాక్షస క్రీడకు తెరలేపారు. ఇలాంటివాటికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి. కానీ జగన్ హయాంలో దీనికి అంతం కనిపించడంలేదు. 40 రోజులుగా చంద్రబాబును జైల్లో ఉంచి, ఇప్పటివరకు ఏ కోర్టులోనూ లిఖితపూర్వక ఆధారాలు చూపించలేకపోయారు. రాష్ట్రంలో ఇలాంటి నికృష్ట ప్రభుత్వం ఉంది. నువ్వు (జగన్) చేయగలిగింది ఏంటంటే... రాజ్యాంగం ప్రకారం అధికారంలో ఉన్నావు కాబట్టి రాక్షస క్రీడ కొనసాగిస్తున్నావు. మానవత్వం లేకుండా, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్న పరిమితులు కూడా దాటిపోయి వ్యక్తిగత కక్ష సాధిస్తున్నారు.
మొన్న డీఐజీ మాట్లాడిన భాష చూశాం. పాలకులను మెప్పించడానికి మాట్లాడడం కాదు... జైలుకు ఓ మాన్యువల్ ఉంటుంది, పోలీసులకు ఓ మాన్యువల్ ఉంటుంది అని గుర్తించాలి. అందరినీ మేం అనడంలేదు. కొందరిని పావులుగా చేసుకుని వాడుకుంటున్నారు. అలాంటి వాళ్లు తమ భాష మార్చుకోవాలి" అని హితవు పలికారు.