naresh: చంద్రబాబు అరెస్ట్‌పై సినీ నటుడు నరేశ్‌ ఏమన్నారంటే..!

Media question Actor Naresh about chandrababu arrest

  • చంద్రబాబు అరెస్ట్ విషయంలో మీ అభిప్రాయం ఏమిటన్న ఇంటర్వ్యూయర్
  • తాను ఏ ఒక్క నాయకుడి గురించి మాట్లాడాలనుకోవడం లేదంటూ సమాధానం చెప్పిన నరేశ్
  • చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ మౌనానికి కారణం చెప్పిన నరేశ్

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై నటుడు నరేశ్ (సీనియర్)కు ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన నేరుగా చంద్రబాబు అరెస్టుపై ప్రత్యేకంగా మాట్లాడలేదు. జనరలైజ్ చేసి సమాధానం చెప్పారు. మార్టిన్ లూథర్ కింగ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నరేశ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సమయంలో ప్రస్తుత రాజకీయాల పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు అరెస్ట్ విషయంలో మీ అభిప్రాయం ఏమిటని ఇంటర్వ్యూయర్ అడిగారు. దానికి నరేశ్ స్పందిస్తూ... తాను ప్రత్యేకంగా ఏ ఒక్క నాయకుడి గురించి మాట్లాడాలనుకోవడం లేదని, కానీ ధర్మం ఎప్పుడూ నిలబడుతుందన్నారు. వ్యక్తిగత దూషణతో లేదా అణచివేత కోసం ఎవరినైనా సరే బంధించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో తిరుగుబాటును సూచిస్తుందని, దానికి ఫలితం తప్పక వస్తుందన్నారు. 

ఎమర్జెన్సీ సమయంలో చాలామంది నాయకులు జైల్లో మగ్గిపోయారని, కానీ ఆ తర్వాత దేశ చరిత్రలో ఎమర్జెన్సీ మాయని మచ్చలా నిలిచిందన్నారు. రాజకీయంగా వారసులు రావడం తప్పు లేదా ఒప్పు అనే అంశంపై తాను మాట్లాడనని, నాయకులు సరిగ్గా పని చేస్తే విలువ ఉంటుందన్నారు. ప్రస్తుతం డబ్బుకు రాజకీయానికి చిక్కుముడులు పడ్డాయని, ఆ చిక్కు ముళ్లను విప్పాల్సి ఉందన్నారు. నటుడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి పోరాటం చేస్తున్నందుకు గర్విస్తున్నానన్నారు.

చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ మౌనంగా ఉండటానికి గల కారణం ఏమిటని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి నరేశ్ స్పందిస్తూ... తాను రాజకీయ పరమైన చర్చల్లోకి వెళ్లాలనుకోవడం లేదని, సినిమా పరిశ్రమ వినోదాన్ని అందించాలన్నారు. ప్రజలకు సమస్యలు వస్తే తాము సాయంగా ఉంటామన్నారు. తాము వినోదాన్ని అందించేవాళ్లం మాత్రమేనని, దీనికి (చంద్రబాబు అరెస్ట్) ప్రజలు సమాధానం చెప్పాలన్నారు. ఇప్పుడు సమాజం అంతా నిశ్శబ్దంగా ఉందంటే తిరుగుబాటు కోసమే అన్నారు.

తాను రాజకీయాలను దగ్గర నుంచి చూడలేదని, క్రియాశీలకంగా పని చేశాను అంతే అన్నారు. నటుడిగా మంచిస్థాయిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చానని, పదేళ్లు రాజకీయాల్లో కొనసాగానని, ఆ తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చేసినట్లు చెప్పారు. మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదన్నారు. ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటే బాధేస్తోందన్నారు. అసభ్యపదజాలంతో తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News