Sherika De Armas: 26 ఏళ్లకే క్యాన్సర్ తో మరణించిన మాజీ మిస్ వరల్డ్ పోటీదారు
- ప్రముఖ మోడల్ షెరికా డి అర్మాస్ క్యాన్సర్ తో కన్నుమూత
- విషాదంలో ఉరుగ్వే మోడలింగ్ వర్గాలు
- గత రెండేళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న షెరికా
ప్రముఖ మోడల్, 2015 మిస్ వరల్డ్ పోటీదారు షెరికా డి అర్మాస్ క్యాన్సర్ తో మరణించింది. ఉరుగ్వే దేశానికి చెందిన షెరికా కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో ఈ నెల 13న కన్నుమూసిందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. షెరికా మృతితో ఆమె కుటుంబంలోనూ, సన్నిహిత వర్గాల్లోనూ విషాదం నెలకొంది. గత రెండేళ్లుగా ఆమె క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతోంది.
ఉరుగ్వేలో అగ్రగామి మోడల్ గా ఉన్న షెరికాకు ఎంతో పాప్యులారిటీ ఉంది. ఈ క్రమంలో ఆమె షే డి అర్మాస్ పేరిట శిరోజాలు, పర్సనల్ కేర్ ఉత్పత్తుల వ్యాపారం కూడా ప్రారంభించింది. క్యాన్సర్ బాధిత చిన్నారుల కోసం పాటుపడే పెరెజ్ స్క్రీమినీ ఫౌండేషన్ కార్యక్రమాల్లోనూ షెరికా పాల్గొనేది.
18 ఏళ్ల వయసుకే షెరికా అందాల పోటీల్లో పాల్గొంది. చైనాలో 2015లో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొన్న షెరికా టాప్-30లో చోటు దక్కించుకోవడంలో విఫలమైంది. అయితే, ఆ పోటీల్లో పాల్గొన్న 18 ఏళ్ల వయసున్నవారిలో టాప్-6లో ఒకరిగా నిలిచింది.